రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన అదానీ పెట్టుబడులు!

ప్రపంచంలోనే సంపన్నులైన పారిశ్రామిక వేత్తలు కొద్ది మందిలో ఒకరుగా గుర్తింపు పొందుతున్న గౌతమ్ ఆదానీ తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో రూ 60,000 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నది. పైగా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేయడం, వెంటనే సంతోషంతో అదానీని `భాయ్’ అని ముఖ్యమంత్రి  సంభోధించడంతో కాంగ్రెస్ వర్గాలు ఓ విధంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.

‘భారత్‌ జోడో యాత్ర’లో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ నిత్యం ఆదానీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితునిగా, ఆదానీతో పాటు ముకేశ్ అంబానీలను కలిపి – ఆ ఇద్దరు పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడం కోసమే కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలు ఉంటున్నాయని అంటి విమర్శలు గుప్పిస్తున్నారు.

‘హమ్‌ దో (నరేంద్రమోదీ-అమిత్‌షా).. హమారా దో (అదానీ-అంబానీ’ అన్నట్టు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నదంటూ రాహుల్ ధ్వజమెత్తుతున్నారు. అటువంటి అదానీ పెట్టుబడులను ఇప్పుడు రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆహ్వానించడంతో బిజెపి నేతల నుండి ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తున్నది.

రాహుల్‌గాంధీ శనివారం ఈ వివాదంపై స్పందిస్తూ ‘‘అదానీకి రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రత్యేక మర్యాదలేమీ చేయలేదు. ఒకవేళ అదానీకి వ్యాపార అవకాశాలను తప్పుడు పద్ధతుల్లో రాజస్థాన్‌ ప్రభుత్వం కల్పించినట్టయితే, దాన్నీ నేను వ్యతిరేకిస్తాను. పెత్తందారీ పెట్టుబడిదారులపైనే నా పోరాటం’’ అంటూ ఇచ్చిన వివరణ ఆయన ఆత్మరక్షణలో పడినట్లు స్పష్టం చేస్తున్నది.

రాజస్థాన్‌లో కొత్తగా సోలార్‌ ప్లాంటు నిర్మాణం, ఎయిర్‌పోర్టు నవీకరణ, సిమెంట్‌ పరిశ్రమ విస్తరణ కోసం మొత్తం రూ. 65 వేల కోట్లు శుక్రవారం అదానీ ప్రకటించారు. దీనిపై రాహుల్‌ను ప్రశ్నించగా, ఇంత భారీ పెట్టుబడిని అదానీ ఆఫర్‌ చేసినప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ తిరస్కరించలేరని, ఒకవేళ తిరస్కరిస్తే అది పెద్ద తప్పు కూడా అవుతుందని అంటూ చెప్పుకొచ్చారు.

అదే బిజెపి పాలిత రాష్ట్రాలలో పెట్టుబడులకు ముందుకు వస్తే ఏదో లాలూచి వ్యవహారం నడిపినట్లు విమర్శలు గుప్పించడం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పెట్టుబడులు ప్రకటిస్తే స్వాగతించడం ద్వందవైఖరి కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

అదానీని శుక్రవారం పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా రాజస్థాన్‌ ప్రభుత్వం స్వాగతించిన తీరును బీజేపీ తప్పుబట్టింది. నిన్నటి వరకు విరోధిగా కనిపించిన వ్యక్తి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతోనే మిత్రుడయిపోయారా ?అని రాజస్థాన్‌ బీజేపీ శాఖ అధ్యక్షుడు సతీశ్‌ పునీయా ఎద్దేవా చేశారు.

మరోవంక, పార్టీ అధిష్ఠానం వైఖరి పట్ల గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి గెహ్లత్ ఉద్దేశ్యపూర్వకంగానే అదానీని  పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించారా? అనే అనుమానాలు కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.  గెహ్లోత్‌ను కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలోకి దించి, ఆ పేరుతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని వత్తిడి చేసి,  ఆ పదవిని ఆయనకు రాజకీయ ప్రత్యర్థి అయినా రాహుల్ గాంధీ మిత్రుడు సచిన్ పైలట్ కు కట్టచెప్పే ప్రయత్నం చేశారు.

అయితే సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్న ప్రయత్నం ఎమ్యెల్యేలతో తిరుగుబాటు చేయించి గెహ్లత్ ప్రతిఘటించడంతో  కాంగ్రెస్‌ బెడిచికొట్టిన విషయం తెలిసిందే. దానితో ఆగ్రహంతో రగిలిపోతున్న రాహుల్ ఇప్పుడు గెహ్లాత్  ను ముఖ్యమంత్రి పదవి నుండి ఎలాగైనా దించి చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే ఇటువంటి కథనాలను కొట్టిపారవేస్తూ “అదానీ కావచ్చు లేదా అంబానీ కావచ్చు లేదా అమిత్ షా కుమారుడు జై షా కావచ్చు … ఎవ్వరు రాజస్థాన్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినా స్వాగతిస్తాను… ” అని గెహ్లాత్ స్పష్టం చేశారు.  ఈ ఉదంతంతో రగిలిపోతున్న గెహ్లోత్‌ అదానీని సదస్సుకు ఆహ్వానించడం ద్వారా బహిరంగంగానే కాంగ్రెస్‌ పెద్దలపై తిరుగుబాటు చేశారని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయా స్పష్టం చేశారు.