
మహారాష్ట్రలో చీలికకు దారితీసిన శివసేన రాజకీయాలు కొత్త మలుపు తీశాయి. రెండు వర్గాలు సహితం తమదే అసలైన శివసేన అంటూ, పార్టీ పేరు, గుర్తు తమకే దక్కాలని ఆశ్రయించడంతో ఈ వివాదం తేలేవరకు ఎన్నికల గుర్తును ఎవ్వరూ ఉపయోగించరాదంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దానితో రెండు వర్గాలు ప్రస్తుతంకు మరో గుర్తును ఎంచుకొని, ఉపఎన్నికలలో పోటీ చేయాల్సి ఉంటుంది.
శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్న ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివసేన తమది అంటే తమదేనని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, షిండే వర్గాలు వాదులాటకు దిగాయి. ఈ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది.
సుప్రీం కోర్టు సహితం ఈ వివాదాన్ని తేల్చాల్సింది ఎన్నికల కమీషన్ మాత్రమే అని స్పష్టం చేయడంతో కమీషన్ ఈ విషయమై ఇరువురు వాదనలు పరిశీలించడం ప్రారంభించింది. తాజాగా శనివారం ఉద్ధవ్‌తో పాటు షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఓ నోటీసు జారీ చేసింది.
శివసేనకు ఇప్పటిదాకా కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లంబును ఇరు వర్గాలూ వినియోగించడం కుదరదని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు వర్గాల మధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. అంతేకాకుండా త్వరలో జరిగే ఉప ఎన్నికకు రెండు వర్గాలు తమ తమ గుర్తులను ఎంచుకోవాలని, అది కూడా రెండు రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
More Stories
దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం
జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం