చెన్నై మార్కెట్లో కూర‌గాయ‌లు కొన్న నిర్మ‌లా సీతారామ‌న్‌

తమిళ‌నాడు రాజ‌ధాని చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన బిజెపి సీనియ‌ర్ నేత‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శ‌నివారం ఉద‌యం నుంచి రాత్రి దాకా బిజీగా గడిపారు.  త‌న షెడ్యూల్ మేర‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌ను ముగించుకున్న ఆమె రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లోకి వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆమె కార్యాలయ సిబ్బంది ట్విట్టర్ లో షేర్ చేశారు. 
 
చెన్నై నగరంలోని మైలాపోర్ ఏరియాలోని ఓ కూరగాయల మార్కెట్ కు నిర్మలా సీతారామన్ వెళ్లారు. మార్కెటంతా కలియ తిరుగుతూ అక్కడి కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. వ్యాపారం ఎలా నడుస్తోందని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ బుట్ట తీసుకొని కందగడ్డ, కాకరకాయలు కొనుగోలు చేశారు.
 కాగా, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ  ప్రజలకు నిత్యావసర సరుకులైన కూరగాయలపై కేంద్రమంత్రి దృష్టి పెట్టినట్లున్నారని కొంతమంది అంటుండగా,  నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్నాయా లేదా అని తెలసుకునేందుకు నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లినట్లున్నారని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.