‘మత మార్పిడి’ కార్యక్రమానికి హాజరైన ఆప్‌ మంత్రి రాజీనామా

మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంత్రి రాజేంద్ర పాల్  గౌతమ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆదివారం పేర్కొన్నారు. ఢిల్లీలో అక్టోబర్ 5న సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో తాను కూడా వారితో కలిసి ప్రతిజ్ఞ చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి. మరోవైపు మాన్యవర్ కాన్షీరామ్ సాహెబ్ వర్ధంతి కూడా. అలాంటి రోజున యాదృచ్ఛికంగా నేను అనేక సంకెళ్ల నుంచి విముక్తి పొందాను. ఈ రోజు నేను మళ్లీ జన్మించాను. ఇప్పుడు నేను ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజం హక్కులు, దౌర్జన్యాలపై పోరాడుతా’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 మంత్రి పదవికి చేసిన రాజీనామా లేఖను కూడా అందులో పోస్ట్‌ చేశారు.కాగా, ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, శుక్రవారం జరిగిన ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. హిందూ దేవుళ్లను ఇకపై దేవతలుగా పరిగణించబోమని ఈ సందర్భంగా ఆయన వివాదాస్పదంగా ప్రసంగించారు.

మరోవైపు ఆప్‌ మంత్రి గౌతమ్‌ ఈ మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడంపై బీజేపీ విమర్శించింది.  హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేసింది.

మరోవైపు, గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా నిరసన సెగలు తగిలాయి. శనివారం కేజ్రీవాల్ పాల్గొనాల్సిన ర్యాలీకి కొద్దిసేపటికి ముందే ఆయన బ్యానర్లు చించేసి కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉండగానే మంత్రి రాజీనామా చేయడం ప్రాధాన్యం  సంతరించుకుంది.