మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చండూర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సహితం ఈ రోజే నామినేషన్ వేయనున్నారు.
తన రాజీనామా మునుగోడు ప్రజల కోసమేనని, నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, కేసీఆర్ వెంట ఉన్న వాళ్లంతా కూడా తెలంగాణ ద్రోహులేనన్న స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు రాష్ట్రంలో సముచిత స్థానం లేదని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలనేవి రాష్ట్ర, దేశ భవిష్యత్తుని నిర్ణయించేవని ఆయన చెప్పారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమి భయంతో కౌరవ సైన్యాన్ని దింపిందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా డబ్బుల సంచులతో ప్రజల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో మునుగోడులో లెంకలపల్లి గ్రామంని తీసుకొని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాడని చెప్పారు.
ప్రాజెక్టులు, కాంట్రాక్టుల పేరుతో దోచుకునే డబ్బునే ప్రజలకు పంచి పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులను తీసుకుంటారు కానీ వాళ్ళ ఓటు మాత్రం బీజేపీకే మాత్రమే పడుతుందని, ఆ నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో ఏ సీఎం పాల్పడనంతా అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సొమ్మును మోడీ, అమిత్ షా కక్కిస్తారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు పెట్టి సొంత విమానం కొనేది దుబాయికో సింగపూర్ కో పారిపోవడానికేనని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డదని, వాళ్లు జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.

More Stories
లడాఖ్‌కు బైక్ యాత్ర యువతికి దత్తాత్రేయ అభినందనలు
ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్
పరస్పరం అవినీతి కప్పిపుచ్చుకుంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్