పార్టీ విధేయుడిగానే ఉంటా, కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు

తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని, ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెట్టి, జైలుకు పంపించారని బిజెపి నుండి సస్పెన్షన్ కు గురై, ప్రస్తుతం పిడి చట్టం క్రింద అరెస్ట్ అయి జైలులో ఉన్న ఎమ్యెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ మత రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
తనను సస్పెండ్ చేస్తూ పార్టీ జారీచేసిన షోకాజ్ నోటిస్ కు ఆయన జైలు నుండే సమాధానం పంపారు. తాను పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదని, ఏ మతంవారిని కించపరచలేదని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు.పార్టీ నియమావళికి, సిద్ధాంతాలకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే వ్యక్తినని, ప్రజలకు, హిందువులకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ బీజేపీ హైకమాండ్ కు ఆయన విన్నవించుకున్నారు.
 
హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించి తనపై 100 కేసులు పెట్టించారని ఆయన ఆ లేఖలో వెల్లడించారు. పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ డిసిప్లినరీ కమిటీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
 
మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసు పెట్టాయని, దాన్ని కోర్టు డిస్మిస్ చేసిందని గుర్తు చేశారు. మునావర్ ఫారుఖీని ఇమిటేట్ మాత్రమే చేశానని, కానీ తాను ఏ మతాన్ని, వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 500 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని తెలిపారు.