జయప్రకాష్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి

యువత లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జయప్రకాష్ నారాయణ విగ్రహాన్ని, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ  అన్యాయాలకు, అక్రమాలకు అరాచకానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపెరగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ అని కొనియాడారు.

 విద్యార్థులందరూ తప్పనిసరిగా మాతృభాషను నేర్చుకోవాలని ఆ తర్వాత ఇతర భాషల పట్ల మక్కువ పెంచుకోవాలని ఆయన సూచించారు. ఆంగ్ల భాషలో చదువుతేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతామని యువతలో ఈ భావన నాటుక పోయిందని, దాన్ని విడనాడాలని స్పష్టం చేశారు. మాతృభాషలో చదివిన వారు ఎంతో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

తాను, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలమని, కానీ తాము మాతృ భాషలో మాట్లాడటానికే ఇష్టపడేవాళ్లమని చెప్పారు. మాతృభాషను ప్రేమించాలని, ఇతర భాషలను గౌరవించాలని సూచించారు. కన్న తల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని మరిచినోడు మానవుడే కాదని స్పష్టం చేశారు.

ఎమర్జెన్సీలో 18 నెలల జైలు జీవితంతో తన రాజకీయ జీవన గమనమే మారిపోయిందని చెబుతూ తాను జైపాల్ రెడ్డి ఇద్దరం జాతీయవాదులమేనని, అయినా సిద్దంతపరంగా భిన్నమైనవాళ్లమని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలే తప్ప శత్రువులుగా ఉండకూడదని హితవు చెప్పారు. చట్టసభలలో ఉన్నత ప్రమాణాలుండాలని, డిక్సస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కాని డిస్ట్రబ్ చేయకూడదని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఉన్నత ప్రమాణాలు, సిద్ధాంత నిబద్దత రాజకీయాల్లో లోపించాయని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నతమైన విలువలు, నీతి నిజాయితీ అవసరమని చెబుతూ రాజకీయాల్లో ఓపిక ఉండాలని, కష్టపడి, శ్రమిస్తే, పట్టుదల ఉన్నవారెవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారని తెలిపారు .