భారీగా కొత్త ఓటరు దరఖాస్తులపై హైకోర్టుకు బీజేపీ  

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా కొత్త ఓటరు దరఖాస్తులు రావడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. అతి తక్కువ సమయంలో 25 వేల మంది ఓటు కోసం దరఖాస్తు  చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకునేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ  న్యాయవాది  రచనా రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ నెల 14న కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించనున్నందున కోర్టు నిర్ణయం వెలువడే వరకు జాబితా విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం గురువారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే 25 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదుచేసుకున్నారు. 

ఫార్మ్ 6 కింద ఓటు కోసం అప్లై చేసుకున్న వారిలో బోగస్ ఓటర్లు ఉన్నారని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించింది.