క్షుద్ర పూజలపై నమ్మకంతో పార్టీ పేరు మార్చిన కేసీఆర్ 

క్షుద్ర పూజలపై నమ్మకంతో, తాంత్రికుల సలహా మేరకే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తన ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా పేర్కొంటూ బిఆర్ఎస్ గా పేరు మార్చారని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. తాంత్రికుల సలహా మేరకే తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంకు రావడం లేదని ఆమె స్పష్టం చేశారు.

తాంత్రికుల సలహా మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం మానేసి, ఇప్పుడు తంత్రం, న్యూమరాలజీని నమ్ముకుని పార్టీ పేరును (టీఆర్‌ఎస్‌ నుంచి) బీఆర్‌ఎస్‌గా మార్చారని ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. తన రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీని ప్రభంజనంను అడ్డుకోవడం కోసమే కేసీఆర్  జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతునిచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో వారిని తీవ్ర నిరాశకు గురిచేశారని ఆమె ధ్వజమెత్తారు. పరిపాలనలో విఫలమై తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన కేసీఆర్ పార్టీ ఏంన్నికలలో ఓటమి చెందడం ఖాయం అని ఆమె  భరోసా వ్యక్తం చేశారు.

‘‘తెలంగాణ రాష్ట్ర సాధనకు నిధులు, నీళ్లు, నియామకాలు (ఉద్యోగాలు) ప్రాధాన్యత అని అప్పట్లో చెప్పారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉంటుందని కూడా చెప్పారు. కానీ, 2014 నుంచి 2018 వరకు నాలుగేళ్లుగా  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు” అని ఆమె గుర్తు చేశారు.

అదేవిధంగా, రెండోసారి 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిన్నర కాలంపాటు ఆయన మంత్రివర్గంలో మహిళా మంత్రి లేరని ఆమె చెప్పారు. కొందరు తాంత్రికుల సలహాతో కేబినెట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించలేదని చెబుతున్నారని ఆమె ఆరోపించారు. 

అదేవిధంగా, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు వంటి అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె స్పష్టం చేశారు. కాళేశ్వరంతో చుక్క నీరు రాలేదని, ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షా 40వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తామన్న కేసీఆర్ ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. 

రూ. 3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశాడని అంటూ ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి తెలంగాణ ప్రజలపై భారాలు వేశారని ఆర్ధిక మంత్రి ఆరోపించారు.  తెలంగాణ రాష్ట్రానికే ఏమీ చేయలేకపోయిన సీఎం కేసీఆర్భా రత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశానికి ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు.  తెలుగు భాషతో పాటు తెలంగాణను మర్చిపోతున్న టీఆర్ఎస్ దేశానికి ఏం చేస్తుందని ఆమె ఎద్దేవా చేశారు.

ఫాంహౌస్‌లో కేసీఆర్‌ క్షుద్రపూజలు

ఇలా ఉండగా, కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని, ప్రతి మూడు నెలలకోసారి నల్లపిల్లితో ఈ పూజలు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారని, ఆ కేసులను ఇప్పటికీ బయటికి రానివ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. 
 
ఒక తాంత్రికుడి సలహాల మేరకే కేసీఆర్‌ పనిచేస్తున్నారని సంజయ్  తెలిపారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చడం, ఏడేళ్లుగా సచివాలయాలయానికి వెళ్లకపోవడం, ఉన్న భవనాన్ని కూల్చివేయడం వంటివన్నీ ఆ తాంత్రికుడి సలహాల మేరకే చేశారని ఆయన స్పష్టం చేశారు.