”ఆదిపురుష్” టీజర్‌పై తలెత్తుతున్న విమర్శల పర్వం

ఆదివారం విడుదలైన బాలీవుడ్ చిత్రం ”ఆదిపురుష్” టీజర్ ఒక్కసారిగా సినిమాను విమర్శల పాలుచేసింది. టీజర్ చూస్తుంటే కార్టున్ వీడియో చూసినట్లు ఉందని ప్రభాస్ అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు. రామాయణ మహా కావ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రభాస్ రామునిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురునిగా, కృతి సనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాముడికి మీసాలేంటి? : శ్రీరాముడి చిత్రపటాల్లోనూ.. దేవాలయాల్లోనూ మీసాలు కనిపించవు. రాముడికి మీసాలు ఉన్నట్టు ఇప్పటి వరకూ ఎవరూ ఎక్కడా చూడలేదు. వినలేదు. ఇప్పటి వరకూ వివిధ భాషల్లో తెరకెక్కిని ఏ సినిమాలోనూ  శ్రీరాముడి పాత్రధారుడికి మీసాలు లేవు. మరి, ఇప్పుడు ఆదిపురుష్లో ప్రభాస్ కు మీసాలు పెట్టడమేంటి? అనే విమర్శలు పలువురు చేస్తున్నారు.

బిజెపి అధికార ప్రతినిధి, నటి మాళవిక అవినాశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “లంకకు చెందిన ఒక శివ-భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు! వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు! అయితే.. “ఆదిపురుష్”లోని రావణుడు.. టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు! మన రామాయణం/చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి! లెజెండ్ ఎన్టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా?” అంటూ ట్వీట్ చేశారు.

ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ రామాయణం గురించి ఆకళింపు చేసుకోకుండా, రావణుడి పాత్ర గురించి అధ్యయనం చేయకుండానే చిత్రాన్ని తీస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను పిల్లలు చూసే యానిమేటెడ్ కార్టున్ చిత్రంలా తయారు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

 ”ఆదిపురుష్” టీజర్‌పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆ చిత్ర దర్శక నిర్మాతలపై మండిపడ్డారు. హిందూ దేవతామూర్తులను తప్పుగా చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మిశ్రా హెచ్చరించారు. 

తాను ఆదిపురుష్ ట్రైలర్ చూశానని, అందులో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని మిశ్రా చెప్పారు. ట్రయలర్‌లో చూపించిన మేరకు హిందూ దేవుళ్లు ధరించిన దుస్తులు, వారి రూపురేఖలు ఆమోదయోగ్యం కావని ఆయన స్పష్టం చేశారు.  బ్రాహ్మడైన రావణుడిని దారుణంగా చూపించారని మండిపడ్డారు. ఆ పాత్రధారి సైఫ్ అలీఖాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబర్, ఔరంగజేబులా ఉన్నాడని ధ్వజమెత్తారు. 

హనుమంతుడు చర్మంతో చేసిన దుస్తులు ధరించినట్లు టీజర్‌లో చూపించారని, కాని రామాయణ మహాకావ్యంలో హనుమంతుడిని వర్ణించిన తీరు వేరే విధంగా ఉందని ఆయన చెప్పారు. అంతే కాదు ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని తప్పుగా ప్రదర్శించారని ఆరోపించారు. 

ఇవి తమ మత భావాలను గాయపరుస్తాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి దృశ్యాలన్నిటినీ చిత్రం నుంచి తొలగించాలని కోరుతూ దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నానని మిశ్రా చెప్పారు. వాటిని తొలగించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

ఇలా ఉండగా, రాంలీల కమిటీ ఈసారి విజయదశమి పండుగను పురస్కరించుకొని ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమానికి కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి  హీరో ప్రభాస్  పాల్గొననున్నారు.