ఉచితాల హామీల అమలుకయ్యే ఖర్చు, డబ్బు గురించి చెప్పాలి

ఎన్నికల ప్రణాళికలలో రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, వాటి అమలు కోసం అయ్యే ఖర్చు విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ కోరుతున్నది.  రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పాటించవలసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో మార్పులు తేవాలని కేంద్ర ఎన్నికల కమిషన్  అందుకు సంబంధించిన ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయమని రాజకీయ పార్టీలను కోరుతుంది. 
 
ఒకవైపు, ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల గురించిన అంశం సుప్రీం కోర్ట్ పరిశీలిస్తుండగా, ఈ విషయమై ఓ కమిటీని నియమించాలను అత్యున్నత న్యాయస్థానం ప్రతిపాదిస్తుండగా, ఈ విషయమై ఓ పత్రాన్ని విడుదల చేయాలని ఎన్నికల కమీషన్ కసరత్తు చేస్తున్నది. 
 
రాజకీయ పార్టీలు అసెంబ్లీ లేదా జాతీయ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల అమలుకు అయ్యే ఖర్చును వివరించాలని, వాటిని ఎలా ఫైనాన్స్ చేయవచ్చుననేది కూడా ఓటర్లకు కొంత ఆలోచనను కలిగించేలా వారి ఆర్థిక స్థితిని కూడా వివరించాలని ప్రతిపాదించింది. 
 
 ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలు పారదర్శకంగా, ప్రజలకు అన్ని విషయాలు తెలిసే విధంగా ఉండేలా చూడాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్గదర్శకాలను సవరించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. దీని కోసం ఓ ప్రామాణిక  ప్రొఫార్మాను జత చేయాలని ప్రతిపాదించింది. గుర్తింపు పొందిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు మంగళవారం ఈ మేరకు ఓ లేఖ రాసింది. 
రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా అడ్డుకోలేనప్పటికీ, ఓటరుకు కూడా సమాచారం ఇచ్చే హక్కు ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అందువల్ల పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘం కోరింది. ఇది ఓటర్లు రాజకీయ పార్టీలను పోల్చి చూసేందుకు, వాగ్దానాలు నిజంగా నెరవేరుతాయో లేదో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 
 ఎన్నికల ప్రణాళికలలో చేసే వాగ్దానాల హేతుబద్ధత, వాటిని అమలు చేయడం కోసం నిధులు అందుబాటులో ఉండటం గురించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వివరణ ఇవ్వాలని ప్రస్తుత ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్గదర్శకాలు చెప్తున్నప్పటికీ, పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రకటనలు యథాలాపంగా, మామూలుగా, సందిగ్ధతతో ఉంటున్నట్లు గమనించినట్లు తెలిపింది. 
 
ఎన్నికల్లో అన్ని విషయాలు తెలుసుకుని, దాని ఆధారంగా ఓ అభ్యర్థిని ఎన్నుకునేందుకు నిర్ణయం తీసుకోవడానికి తగిన సమాచారాన్ని ఈ ప్రకటనలు ఓటర్లకు అందజేయడం లేదని గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రతిపాదిత సవరణలపై అభిప్రాయాలను ఈ నెల 18 నాటికి తెలియజేయాలని గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను కోరింది. 
ఈ వాగ్దానాన్ని అమలు చేస్తే లబ్ధి పొందేవారు ఎవరు? ఉదాహరణకు, వ్యక్తులు, కుటుంబాలు, కులాలు, మతాలు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు, లేదా, మొత్తం జనాభా? వాగ్దానాల అమలుకు ఎంత ఖర్చవుతుంది? ఆర్థిక వనరుల లభ్యత, వాగ్దానాల అమలుకు అదనపు ఖర్చు కోసం వనరులను ఏ విధంగా సేకరిస్తారు?
అదనపు వనరుల సేకరణ వల్ల రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సుస్థిరతపై పడే ప్రభావం ఏమిటి? వంటి వివరాలను ఈ ప్రొఫార్మాలో తెలియజేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలో తాజా ఆర్థిక పరిస్థితి గురించి  వెల్లడించాలని కూడా ప్రతిపాదించింది.