షియా ముస్లింలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆఫ్ఘన్ మహిళలు

షియా ముస్లిం మైనారిటీపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు ఆందోళనలు చేపడుతున్నారు. బాలికల విద్యహక్కు, మహిళల స్వేచ్ఛ కోసం పోరాడతామని నినాదాలు చేస్తున్నారు. హజారా కమ్యూనిటీ, మహిళలు, మైనారిటీలపై ఆంక్షలను, దాడులను సోషల్‌మీడియా వేదికగా ఖండిస్తున్నారు. 

గతవారం కాబూల్‌లోని ఓ విద్యాసంస్థపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 53 మంది విద్యార్థులు, అధికంగా విద్యార్థినులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ సంస్థ ప్రకటించలేదు. ఈ దాడిని ఖండిస్తూ కాబూల్‌, హెమాత్‌, బమియాన్‌ ప్రాంతాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలు ఆందోళనలు చేపడుతున్నారు. 

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత మూతపడిన బాలికల పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం కూడా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జహ్రా మొసావి సహా విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు పురాతన నగరమైన మజార్‌ ఇ షరీఫ్‌ వీధుల్లో నిరసన వ్యక్తం చేశారు.

‘ఆజాదీ’ (స్వాతంత్య్రం) అని రాసి ఉన్న ఫ్లకార్డును ప్రదర్శించారు. ఈ అణచివేతలను ఎదుర్కొనేందుకు ఆందోళనలు చేపడుతున్నామని, తమని తామే కాపాడుకోవాలని, హజారా కమ్యూనిటీపై మారణహోమం అంతంకావాలని మసోవి తెలిపారు. సమానత్వం, న్యాయం కోసం తాము గొంతెత్తుతున్నామని, విద్య, పనిచేసే హక్కు, మహిళల స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

కాబూల్‌తోపాటు హెరాత్‌, బమియాన్‌లలో కూడా గతవారం నుండి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలకు మహిళలే నాయకత్వం వహించడం గమనార్హం. కాజా విద్యాసంస్థపై జరిగిన దాడిని ప్రశ్నిస్తున్నామని, ఆఫ్ఘన్‌ బాలికల విద్య హక్కుని ఎందుకు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

విద్యను కోరుకున్నందుకు ఆ బాలికలు బలయ్యారని మరో విద్యార్థిని అలిజాదా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాశవిక దాడుల కారణంగా చాలా కుటుంబాలు తమ కుమార్తెలను చదువుకునేందుకు అనుమతించడం లేదని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో విద్యను కోరుకున్న నేరానికి బాలికలు, బాలురు చంపబడుతున్నారని ప్రశ్నించారు.

పరిమితంగానే చేరినప్పటికీ.. యువకులు కూడా మహిళలకు అండగా నిలవడం ఇదే మొదటిసారని మొసావి తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, వేధింపులను చూస్తూ ఎంతకాలం మౌనంగా ఉంటారని ఆఫ్ఘన్‌ యువకులను ప్రశ్నించారు. ఈ రోజు మీరు మౌనంగా ఉంటే.. ఇదే హింసను మీరూ ఎదుర్కోవలసి రావచ్చని హెచ్చరించారు.

మరోవంక, శాంతియుత ప్రదర్శనలతో తాలిబన్‌ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. నిరసనకారులను అణచివేసేందుకు భద్రతాదళాలు విరుచుకుపడుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వారిపై కాల్పులకు దిగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. 

ఆందోళన చేపడుతున్న బాలికలను కొట్టారని, వారి ఫోన్‌లు పగలకొట్టారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని అలిజిదా తెలిపారు. ఒక తాలిబన్‌ బాలిక తలకు గన్‌పెట్టి కాల్చివేస్తామంటూ హెచ్చరించారని చెప్పారు. విద్యార్థినులను యూనివర్శిటీ కాంపస్‌ నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారని, గేట్లకు తాళాలు వేశారని జహ్రా మొసావి తెలిపారు.