కేరళలో పీఎఫ్‌ఐతో 873 మంది పోలీసులకు సంబంధాలు

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) పై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సిద్ధం చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. నిషేధిత పీఎఫ్‌ఐతో కేరళకు చెందిన కనీసం 873 మంది పోలీసులు సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్‌ఐఏ తన నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తున్నది. 

కేరళ డీజీపీకి ఎన్‌ఐఏ తన నివేదికను సమర్పించగా, ఈ విషయం బహిర్గతమయ్యాయి. నివేదికలోని అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా తయారయ్యాయి. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కు సంబంధించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నది.

ఇప్పటికే డజన్‌కు పైగా పీఎఫ్‌ఐ సంస్థ నిర్వాహకులను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ వారికి ఆర్థికంగా, హోదాపరంగా చోదోడువాదోడుగా నిలిచిన ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులను ఎన్‌ఐఏ స్కానింగ్‌ చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేరళలో కనీసం 873 మంది పోలీసు సిబ్బంది పీఎఫ్‌ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్‌ఐఏ తేల్చింది.

దీనికి సంబంధించిన నివేదికను ఆ రాష్ట్ర పోలీస్‌ చీఫ్‌కు అందించడంతో.. ఈ విషయాలు బట్టబయలయ్యాయి. సబ్ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హెడ్ ఆఫీసర్ ర్యాంక్ అధికారులు, సివిల్ పోలీసు సిబ్బందిలపై ఎన్‌ఐఏ దృష్టిసారించినట్లుగా సమాచారం. ఈ అధికారుల బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీల వివరాలను సేకరిస్తున్నట్లుగా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

ముఖ్యంగా పోలీసుల సోదాలు, దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ఈ పోలీసులు పిఎఫ్ఐ కు అందించేవారని, అదే విధంగా వారి టార్గెట్ గా ఉన్న ఆర్ఎస్ఎస్, ఇతర సంస్థల నేతల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించేవారని తెలుస్తున్నది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుల సమాచారాన్ని పీఎఫ్‌ఐకి లీక్ చేశారన్న ఆరోపణలతో గత ఫిబ్రవరిలో అనేక మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్‌ చేసిన పోలీసు ఉన్నతాధికారులు  తొడుపుజాలోని కరిమన్నూర్ పోలీస్ స్టేషన్‌కు అటాచ్‌గా ఉన్న సివిల్ పోలీసు అధికారిని సర్వీసు నుంచి తొలగించారు. 

ఇదే కేసులో ఎస్‌ఐ సహా ముగ్గురు పోలీసులను మున్నార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఎన్‌ఐఏ జాబితాలో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ వింగ్‌కు చెందిన సిబ్బందితోపాటు కేరళ పోలీసు అధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. పోలీసులు జరిపిన దాడులతో సహా అనేక సమాచారాన్ని వీరు లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇలాఉండగా, కేంద్ర దర్యాప్తు సంస్థలు రెండో రౌండ్‌ దాడులు చేపట్టాయి. పీఎఫ్‌ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్లు సేకరించిన పకడ్బందీ ఆధారాల మేరకు రెండు రోజుల్లో 278 మందిని అరెస్ట్‌ చేశారు.ఈ సందర్భంగా జరిగిన సోదాలలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో స్వాధీనం చేసుకున్న పలు పత్రాలలో తేలికపాటిగా లభ్యమయ్యే పదార్ధాలతో ప్రేలుడు పదార్ధాలను ఎలా తయారు చేయాలో తెలిపే స్వల్పకాలిక శిక్షణ సమాచారం కూడా లభించినట్లు చెబుతున్నారు.