త్వరలో ఎస్టీ జాబితాలో గుజ్జర్లు, బకర్వాల్, పహారీలు 

గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. పహారీలకు ఎస్టీ హోదా మంజూరైతే దేశంలోనే ఒక భాష మాట్లాడే వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం తొలిసారి కానుంది. 

ఇది జరగాలంటే కేంద్రం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలి. జమ్ముకశ్మీర్ లో మంగళవారం నుండి మూడు రోజుల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న రాజౌరీలో నిర్వహించిన భారీ ర్యాలీని ఆయన ప్రారంభిస్తూ 370ని రద్దు చేసిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయని తెలిపారు.

జస్టిస్ శర్మన్ కమిషన్ గుజ్జర్లు, బకర్వాల్, పహారీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని, అవి త్వరలోనే అమలవుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతాయని చెప్పారు. 

ఆర్టికల్ 370, 35ఏ లను తొలగించకుంటే గిరిజనులు రిజర్వేషన్లు పొందడం సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వాటిని తొలగించడంతో గిరిజనులు వారి హక్కులు పొందుతారని వెల్లడించారు. 70 ఏళ్లుగా కశ్మీర్ ను మూడు కుటుంబాలే పాలించాయని, ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిపులు పెంచామని, 100కు పైగా కొత్త స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేల కోసం లక్ష  కోట్లు రూపాయిలను మంజూరు చేశామని తెలిపారు. ఇవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జరిగాయని పేర్కొన్నారు.

అధికరణ 370ని రద్దు చేస్తే, రక్తపాతం తప్పదని చాలా మంది హెచ్చరించారని, అలాంటివారికి సమాధానం నేటి సభ, మోదీ-మోదీ అంటూ మీరు చేస్తున్న నినాదాలేనని తెలిపారు. జమ్మూ-కశ్మీరును మూడు కుటుంబాలే పరిపాలించేవని, కానీ ఇప్పుడు పంచాయతీలు, జిల్లా కౌన్సిళ్ళకు ఎన్నికైన 30,000 మంది చేతులకు అధికారం వచ్చిందని చెప్పారు.
అంతకుముందు అమిత్ షా మాతా వైష్ణో దేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెంటరాగా అమిత్ షా హెలికాప్టరులో సంజిచట్టు వద్ద దిగి శ్రీమాత వైష్ణో దేవి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వైష్ణోదేవి మాతకు హారతి ఇచ్చారు. కేంద్ర హోం మంత్రిగా నియుక్తులయ్యాక వైష్ణవి దేవి మందిరానికి అమిత్ షా రావడం ఇదే తొలిసారి. నవరాత్రి వేడుకల తొమ్మిదవ రోజున ఆయన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం యాదృచ్ఛికం.
పూజల అనంతరం రాజౌరీ బహిరంగసభలో ప్రసంగించారు. జమ్మూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. రఘునాథ్ దేవాలయంలోనూ అమిత్ షా పూజలు జరిపారు.అనంతరం జమ్మూకశ్మీరులో శాంతిభద్రతల పరిస్థితిపై హోంశాఖ మంత్రి సమీక్షించారు.
అమిత్ షా మంగళవారం నుంచి మూడు రోజులపాటు జమ్మూ-కశ్మీరులో పర్యటిస్తున్నారు. 2019 ఆగస్టులో మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
రాజౌరీలో బహిరంగ సభ నేపథ్యంలో జమ్మూ, రాజౌరీ జిల్లాల్లో మొబైల్ డేటా సర్వీసెస్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. మొబైల్ సేవలను దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.