జమ్మూకశ్మీర్‌ జైళ్లశాఖ డిజి లోహియా హత్య

జమ్మూకశ్మీర్‌కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా (57) హత్యకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు. 

డీజీ ఇంట్లో పని చేసే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పనిమనిషి పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చేపట్టారు. డీసీ హత్యకు గురవడంతో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. లోహియా మరణంపై సీనియర్‌ పోలీస్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

ఈ హత్యను  అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర డిజిపి దిలీబాగ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. నిందితుడు లోహియాను దహనం చేసేందుకు కూడా ప్రయత్నించాడని ఆయన తెలిపారు. జమ్మూ నగరం శివారులోని యూడియావాలాలో లోహియా ఇంటిని సందర్శించిన జమ్మూ జోన్ అదనపు డీజీ ముకేశ్ సింగ్ ఆయన దేశంపై కాలిన గాయాలు, మెడపై కట్టి గాట్లు ఉన్నాయని చెప్పారు.  

లోహియా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్‌ డిప్యూటేషన్‌ నుంచి తిరిగి వచ్చారు. జమ్మూకు తిరిగి వచ్చే ముందు బీఎస్‌ఎఫ్‌లో పని చేశారు. ఆ తర్వాత డీజీపీ హోదాలో పదోన్నతి పొందారు. ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌ డీజీపీగా నియామకమయ్యారు.

30 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‌లో పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో సెంట్రల్‌ కశ్మీర్‌ డీఐజీగా ఉన్నారు. లాల్ చౌక్ వద్ద జరిగిన ఫిదాయీన్ దాడిలో పాకిస్థానీ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 

ఆ తర్వాత దక్షిణ కాశ్మీర్ డీఐజీగా పనిచేశారు. సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లడానికి ముందు సీఐడీలోనూ విశేష సేవలందించారు.