వివాదం రేపిన కర్ణాటక జెండాపై రాహుల్‌ ఫొటో

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తొలి నుండి ఏదో ఒక వివాదం రేపుతున్నది. ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న ఆయన తాజాగా మరో వివాదంపై కేంద్ర బిందువు అయ్యారు. కాంగ్రెస్‌ శ్రేణుల అతిపై కన్నడ అనుకూల సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోని పక్షంలో తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 

మైసూరు సమీపంలో రాహుల్‌ను చూడగానే కాంగ్రెస్‌ శ్రేణులు అత్యుత్సాహంతో బ్యానర్లు, పోస్టర్లు, జెండాలతో యాత్ర సాగే ప్రాంతాన్ని నింపేశారు. రాహుల్ యాత్ర కొనసాగుతుండగా కొందరు పార్టీ శ్రేణులు కర్ణాటక అధికారిక జెండాను పట్టుకుని కదలడం కనిపించింది. 

పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న ఈ జెండా కర్ణాటక జెండాగా పరిగణిస్తారు. ఈ జెండాపై స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు రాహుల్‌ గాంధీ బొమ్మను కూడా ముద్రించి ప్రదర్శించారు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కర్ణాటక జెండాపై రాహుల్‌ బొమ్మను ముద్రించడం ముమ్మాటికీ కర్ణాటక ప్రాంతాన్ని అవమానించడమే అని కన్నడ అనుకూల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘ఇలా కన్నడ జెండాపై రాహుల్‌ ఫొటోను ముద్రించడాన్ని ఖండిస్తున్నాం’ అంటూ స్పష్టం చేశాయి. 

కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య అధికారంలో ఉన్న సమయంలో కన్నడ జెండాను మార్చారని, ఇప్పుడేమే కాంగ్రెస్‌ శ్రేణులు ఏకంగా కన్నడ జెండాపై రాహుల్‌ను ముద్రించారని ఇది సిగ్గుచేటు అని కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక్‌ మండిపడ్డారు. 

కన్నడ అధికారిక జెండాను రాహుల్‌ ముద్రించడంపై బేషరతుగా క్షమాపణలు చెప్పి చేసిన తప్పును సవరించుకోవాలని పలు కన్నడ అనుకూల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాహుల్‌ గాంధీ బహిరంగ క్షమాపణలు చేప్పనట్లయితే ఎలా గుణపాఠం చెప్పాలో తమకు  తెలుసునని వారు హెచ్చరించారు.