ములాయం ఆరోగ్యం విషమం… ప్రధాని ఆరా

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ (82) ఆరోగ్యం విషమించింది. దీంతో ఆదివారం ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో చేర్చారు. ప్రస్తుతం ములాయంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు ఆ దవాఖాన వర్గాలు వెల్లడించాయి. 

ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు కుటుంబసభ్యులు గురుగ్రామ్‌కు చేరుకున్నారు. ములాయం సోదరుడు శివ్‌పాల్‌సింగ్‌ యాదవ్‌ ఢిల్లీలోనే ఉండగా, కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ లక్నో నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. 

ఆగస్టు 22 నుంచి మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్న ములాయం సింగ్‌ యాదవ్‌ అంతకుముందు జూలైలో కూడా అదే హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై పలువురు రాజకీయ నాయకులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి. 

  ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసి ఆయన తండ్రి  ఆరోగ్య   పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అవసరమైన సహాయం అందగలదని హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తదితరులు కూడా అఖిలేష్ యాదవ్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఆసుపత్రిలోని వైద్యులు ములాయం సింగ్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరినట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ములాయం త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.