వాయుసేనలోకి తేలికపాటి స్వదేశీ హెలికాప్టర్

పూర్తిగా స్వదేశీ నిర్మిత పోరాటపటిమల తేలికపాటి హెలికాప్టర్ (ఎల్‌సిహెచ్) సోమవారం భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)లో చేరనుంది. వాయుసేనలో చేరే దేశీయ హెలికాప్టర్ల క్రమంలో ఇది తొలి దఫా హెలికాప్టర్. ఈ ఎల్‌సిహెచ్ బహుళ స్థాయి వేదికగా ఉంటూ ఏకకాలంలో పలు మిస్సైళ్లను శత్రువుపై ఉపయోగించగలదు. 

ఇతర ఆయుధాలను కూడా గురి చూసి పంపించి లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రభుత్వ అధీనపు ప్రధాన దేశీయ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది. అత్యంత ఎతైన దుర్భేద్య ప్రాంతాలలోకి చొచ్చుకుని వెళ్లే శక్తిసామర్థ్యాలను ఇది సంతరించుకుని ఉంది. 

ఈ హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ పోరాట పటిమ గణనీయంగా పెరుగుతుందని రాజ్ నాథ్ సింగ్ ఆదివారం ట్వీట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ కోసం 10, ఆర్మీ కోసం 5 ఎల్ సీహెచ్ లను సమకూర్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ గత మార్చిలో ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 3,887 కోట్లను కేటాయించింది. ఇటీవలే ఈ హెలికాప్టర్లు ఆర్మీలో  చేరగా, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చేతికీ అందనున్నాయి.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో వాయుసేన దళంలోకి ఈ హెలికాప్టర్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి సమక్షంలో వీటిని వాయుసేనలోకి నేడు లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు ఇంజిన్ల వాయు సారధి ఇప్పటికే పలు రకాల ఆయుధాల పరీక్షలలో తన సత్తా చాటుకుంది.

రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు. శత్రు రాడార్లను బోల్తాకొట్టించే స్టెల్త్‌ సామర్థ్యం వీటికి ఉన్నది.  సముద్రంలో, నేలపై, అడవుల్లో, హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థంగా ఎగిరేలా తయారు చేసిన ఎల్ సీహెచ్​లు అటు పాక్, ఇటు చైనా సైన్యానికి వణుకు పుట్టించడం ఖాయమని  నిపుణులు చెబుతున్నారు.

నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్‌ గేరును వీటికి అమర్చారు. 5 వేల మీటర్ల ఎత్తులో కూడా ఇవి టేకాఫ్‌ కాగలవు. తక్కువ బరువున్న ఈ హెలికాప్టర్లు వాయుసేన, ఆర్మీ అవసరాలను తీర్చగలుగుతాయి. దీనిని పూర్తిగా ఆర్మర్డ్ వెహికల్గా రూపొందించడంతో శత్రువులు ఫైరింగ్ చేసినా పెద్దగా డ్యామేజ్ కాదు. ఒకవేళ కూలిపోయినా తట్టుకునేలా ల్యాండింగ్ గేర్ అమర్చారు.  

కేవలం 5.8 టన్నుల బరువు ఉండే ఎల్ సీహెచ్లలో 24 చిన్న మిసైళ్లు, ఇతర ఆయుధాలు ఉంటాయి. శత్రు రాడార్లు, మిసైళ్లు, జెట్లకు చిక్కకుండా తప్పించుకుంటూ వాటిపై దాడి చేసే సత్తా వీటి సొంతం. దీని ముందు వైపు ఉన్న గన్ 110 డిగ్రీల కోణంలో తిరిగి బులెట్లు పేల్చగలదు.