ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమం

అనారోగ్య కారణాల రీత్యా గత ఆదివారం గురుగావ్ ఆసుపత్రిలో చేరిన స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ను మంగళవారం విడుద‌ల చేశాయి. మేదాంత హాస్పిటల్‌ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్న‌ట్లు వైద్యులు తెలిపారు. 

సమగ్ర నిపుణుల బృందం ఆధ్వర్యంలో ములాయంకు  చికిత్స కొన‌సాగుతోంది. ములాయం సింగ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పార్థిస్తున్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ములాయంను గత వారం ఆసుపత్రిలో చేర్చిన ముచ్చట తెలిసిందే.

 82 ఏళ్ల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ చాలా రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. అయితే ఆదివారం అతని పరిస్థితి క్షీణించడంతో కేర్ యూనిట్‌కు మార్చినట్లు వైద్యులు వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్యం స్థిరంగా, మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

అయితే మంళవారం ఉదయం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తాజా హెల్త్ బులిటెన్ తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపింది.

కాగా, ములాయం సింగ్ శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని, హర్యానాలోని ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య నిపుణుడు డాక్టర్ శుక్లా కటారియా పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనను కలుసుకోవడం కష్టమని, ఆసుపత్రిలోకి ఎవరినీ  అనుమతించడం లేదని, ఎవరూ ఆసుపత్రికి రావద్దని కోరింది. 

ఎప్పటికప్పుడు తాజా సమాచారం తాము అందిస్తామని ఒక ట్వీట్‌లో తెలిపింది. కాగా, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్  ఆసుపత్రిని సందర్శించారు. పలువురు రాజకీయ ప్రముఖలు కూడా ములాయం త్వరలో కోలుకోవాలని అభిలషించారు. ఎలాంటి సాయం అవసరమైనా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధానమంత్రి మోదీ ఓ ట్వీట్‌లో తెలిపారు.