దసరాకు హైదరాబాద్లో పేలుళ్లకు పాక్ నుండే భారీ కుట్ర!

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర భగ్నం కేసులో నిందితుడు అబ్దుల్ జాహెద్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ నుంచి జాహెద్ అండ్ టీంకు  పేలుడు పదార్థాలు అందినట్లు దర్యాప్తులో గుర్తించారు. గత నెల 28న పేలుడు పదార్థాలు పాకిస్తాన్ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్ కు చేరినట్లు తెలిపారు.

జాహెద్  బైక్ పై వెళ్లి 4 హ్యాండ్ గ్రెనేడ్లను తీసుకొచ్చాడు.  వీటిలో ఒక గ్రెనేడ్ ను తన దగ్గరే ఉంచుకొని, మిగతా  మూడింటిని మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్ లకు ఇచ్చాడు.  షమీ సెల్‌ఫోన్‌తో ఫరాతుల్లా గౌరీతో జాహెద్ చాట్ చేశాడు. 12 ఏళ్లు జైల్లో ఉండి తిరిగొచ్చి ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేశాడు. 

పాకిస్తాన్ లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.  హైదరాబాద్‌లో జరిగే సామూహిక ఉత్సవాల్లో దాడులకు ప్లాన్ రచించాడు. మజా, షమీ, జాహెద్‌లతో కలిసి ఒకేసారి దాడులకు కుట్ర పన్నారు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి భయోత్పాతానికి ప్లాన్ చేశారు.

సైదాబాద్‌ ప్రధాన రహదారిలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో విజయదశమి రోజున జరిగే ‘రామ్‌లీలా’ కార్యక్రమం వద్ద పేలుళ్లకు వీరు కుట్రపన్నారని సిట్‌ నిర్ధారించింది. పాకిస్థాన్‌ నుంచి తెప్పించిన నాలుగు గ్రనేడ్లతో విధ్వంసానికి వ్యూహరచన చేసిందని సిట్‌ వర్గాలు వెల్లడించాయి. పేలుళ్ల విషయంలో విఫలం కావ్వొద్దనే ఉద్దేశంతో జాహెద్‌ పక్కా పథకాన్ని రూపొందించాడు. 

అందుకోసం సమీయుద్దీన్‌, హసన్‌తోపాటు మరో ఏడుగురిని నియమించుకున్నాడు. వారం రోజుల క్రితం సైదాబాద్‌లో ఈ తొమ్మిది మందితో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వీరంతా ఆంజనేయస్వామి ఆలయం వద్ద రెండు సార్లు రెక్కీ నిర్వహించారు. 

దాడి ఎలా చేయాలి? ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? సీసీ కెమెరాలకు చిక్కకుండా ఏయే మార్గాల్లో వెళ్లాలి? అనే రూట్‌మ్యా్‌పను రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమానికి కనీసం 3 వేల మంది వస్తారు. నాలుగు గ్రనేడ్లతో దాడి చేస్తే.. ప్రాణనష్టం కూడా తీవ్రంగానే ఉంటుందని ఈ గ్యాంగ్‌ అంచనా వేసింది. 

అంతేకాదు, ఫర్హతుల్లా ఘోరీ టార్గెట్‌ హైదరాబాద్‌లో విధ్వంసాలతోపాటు, మతకల్లోలాలు రేపడమని పేర్కొన్నాయి. రామ్‌లీలా కార్యక్రమంలో పేలుళ్లతో భారీగా ప్రాణనష్టం జరిగితే, రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయని ఫర్హతులా, జాహెద్‌ భావించినట్లు తెలుస్తోంది. సామూహిక దాడులతో ప్రజల్లో అనిశ్చితి నెలకొల్పి, అంతర్గత భద్రతకు ముప్పువాటిళ్లే విధంగా దాడులకు స్కెచ్ వేశారు.

భారీగా ప్రాణ నష్టం చేయాలని నిందితులు ప్రణాళిక సిద్ధం చేశారు.  ఇందుకోసం హవాలా మార్గంలో దాదాపు రూ.30 లక్షలకు పైగా నిధులు సమీయుద్దీన్, మాజ్, జాహెద్ లకు అందినట్లు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల యువకులకు డబ్బు ఆశ చూపించి ఉగ్రవాదం వైపు మళ్లించి, హైదరాబాద్ లో దాడులకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ  20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి భారత్ లో ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్నాడు. అతడి కనుసన్నల్లోనే తాజాగా హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 

62  ఏళ్ల ఫర్హతుల్లా ఘోరీ  స్వస్థలం సైదాబాద్ లోని కుర్మగూడ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అతడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ లో ఉంటూ లష్కరే తైబా, జేషే మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నాడు.