శశిథరూర్ మేనిఫెస్టోలో పొరపాటుగా దేశ పటం.. బీజేపీ ఆగ్రహం!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ  చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ శశిథరూర్ నామినేషన్ దాఖలు సందర్భంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికపై దేశ పటంను పొరపాటుగా చిత్రీకరించడం వివాదంకు దారితీసింది. ఈ విషయమై బిజెపి ఆయనపై విరుచుకు పడింది. 
శశి థరూర్ మ్యానిఫెస్టోలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు మినహాయించిన భారతదేశ మ్యాప్‌ను ఉంది. 13 పేజీల మేనిఫెస్టో పుస్తకాన్ని ఆయన పరిశీలించకుండానే విడుదల చేశారా? అంటూ కొందరు మండిపడ్డారు. భారతదేశం మ్యాప్ తప్పుగా చూపించడం సంచలనంగా మారడంతో ఆ తర్వాత శశి థరూర్ కార్యాలయం తమ మ్యానిఫెస్టోలో కొన్ని సవరణలు చేసింది.
 ఈ చర్య ఇటు పార్టీ వర్గాలను ఉలిక్కిపడేలా చేయగా, ఊహించని విధంగా బీజేపీకి పదునైన అస్త్రం దొరకడంతో భారత్‌ను  వక్రీకరించారంటూ శశిథరూర్‌పై విమర్శలు గుప్పించింది. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశి థరూర్ తన మ్యానిఫెస్టోలో భారతదేశ మ్యాప్‌ను మార్చేశారని ధ్వజమెత్తారు.
“రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ దేశాన్ని ఎకం చేయాలన్న ఆలోచనలో ఉండగా, ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోటీ పడుతున్న వ్యక్తి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా ఇది గాంధీల ఆదరాభిమానాలను చూరగొనడానికి మంచి మార్గం అని భావించి ఉండవచ్చు” అని ఎద్దేవా చేశారు.
”శశిథరూర్‌కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు” అని మాలవీయ ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శశిథరూర్ కార్యాలయంపై విమర్శలు గుప్పించారు. విభజనను శశిథరూర్ కోరుకుంటున్నారని ఆరోపించారు.
కాగా, తప్పుడు భారత్‌ మ్యాప్‌పై శశి థరూర్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఎవరూ కూడా ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరని పేర్కొన్నారు. చిన్న వాలంటీర్ల బృందం వల్ల ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. ఆ మ్యాప్‌ను వెంటనే సరిచేసినట్లు వెల్లడించారు. జరిగిన పొరపాటుకు తాను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానంటూ ట్వీట్‌ చేశారు. 
 
మ్యాప్ సంబంధిత వివాదంలో శశిథరూర్ చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. 2019లోనూ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ నిరసనకు సంబంధించిన బుక్‌లెట్ కవర్‌ను ఆయన షేర్ చేశారు. అప్పుడు కూడా లఢక్, జమ్మూకశ్మీర్‌లు లేని భారత్ మ్యాప్‌ను వాడారు. బీజేపీ విరుచుకుపడటంతో జరిగిన పొరపాటును గ్రహించి ఆతర్వాత మ్యాప్‌ను తొలగించారు.
 
కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పార్టీ నేత శశిథరూర్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తిరువనంతపురం ఎంపీగా ఉన్న థరూర్ తన నామినేషన్ పత్రాలను పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి సమర్పించారు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి,  రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే సహితం నామినేషన్ దాఖలు చేశారు. 
 
గాంధీ కుటుంబం అభ్యర్థిగా తొలుత దిగ్విజయ్ సింగ్ నామినేషన్ దాఖలుకు సిద్ధపడితే,  చివరి క్షణంలో ఖర్గే అభ్యర్థిగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో నూతన జవసత్వాలు నింపడంకోసం పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుపుతున్నామని చెబుతుండగా, ప్రతిపక్ష పార్టీగా ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్న సమస్యల్లో 80 ఏళ్ళ వృద్ధ నాయకుడిని ఎంపిక చేయడం ద్వారా పార్టీ అధ్యక్షుడు ఎవరైనా సరే, పెత్తనం మాత్రం గాంధీ కుటుంభందే అన్న సందేహం ఇచ్చినట్లయింది.