5జీ సేవ‌ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు దేశంలోకి 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చేశాయి. ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 5జీ సేవ‌ల్ని ప్రారంభించారు. రానున్న కొన్ని సంవ‌త్స‌రాల్లో ఈ సేవ‌లు దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్‌లో జ‌రిగిన ఎగ్జిబిష‌న్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని పాల్గొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ అంటే తనను మొదట్లో ఎగతాళి చేశారని, సాంకేతికత కేవలం సంపన్నులకు అని, పేదలకు పనికిరాదని భావించేవారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే సాంకేతికత ప్రతి పేదవాని ఇంటికి చేరాలన్నది తన దృఢసంకల్పం అని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో నేడు భారత్ కు చారిత్రాత్మక దినం అని పేర్కొంటూ 5జి మన టెలికం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నదని చెప్పారు.

5జితో భారత్ ఆర్ధిక ఆర్ధిక ఐ వ్యవస్థ 2035 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకొంటుందని ప్రధాని తెలిపారు.  భారత్ సాంకేతికత వినియోగదారునిగాను మాత్రమే కాకుండా ప్రధానమైన, క్రియాశీలక అభివృధ్దిదారునిగా కూడా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. టెలికాం సాంకేతికతతో భారత్ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పినదని చెప్పారు.

2014లో దేశంలో రెండు మొబైల్  కంపెనీలు మాత్రమే ఉండేవని, నేడు 200 వరకు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి.

ఆర‌వ ఇండియ‌న్ మొబైల్ కాంగ్రెస్‌ను కూడా ప్ర‌ధాని ప్రారంభించారు. అయితే దివాళీ నుంచి యూజ‌ర్లు 5జీ సేవ‌ల‌ను ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో, క్వాల్‌క‌మ్ కంపెనీలు త‌మ 5జీ సేవ‌ల గురించి ప్ర‌ధాని మోదీకి వివ‌రించాయి. ఆకాశ్ అంబానీ 5జీ గురించి ప్ర‌ధానికి డెమో ఇచ్చారు.

ప్ర‌ధాని మోదీ 5జీ సేవ‌ల్ని ప్రారంభించ‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. టెలికాం చ‌రిత్ర‌లో ఈ రోజు సువ‌ర్ణ అక్ష‌రాల‌తో నిలిచిపోతుంద‌ని పేర్కొన్నారు. డిజిట‌ల్ ఇండియాకు ఇది ఫౌండేష‌న్‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ డిజిట‌ల్ సేవ‌ల్ని చేర‌వేయ‌డంలో 5జీ ఉప‌క‌రిస్తుంద‌ని మంత్రి వైష్ణ‌వ్ వెల్ల‌డించారు.

మొదటి దశలో ఢిల్లీ ప్రధాన నగరాల్లో ప్రారంభించి, వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్ వర్క్ ను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పునె, అహ్మదాబాద్, చండీగడ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

ప్రస్తుతం మనం 4 జీ సేవలు వాడుతున్నాం. దీనికి కంటే మెరుగైన సేవలు 5జీ తో అందుతాయి. 4 జీలో గరిష్ట డౌన్ లోడ్ వేగం 1 జిబిపిఎస్ అయితే 5జీలో 10 జిబిపిఎస్.  దీంతో ఎక్కువ క్వాలిటీ, డ్యురేషన్ ఉన్న వీడియోలను, సినిమాలను సెకన్ల వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

4 జీ – 5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధాన తేడా సమాచారం ప్రసారమయ్యే విధానం. 4 జీలో సమాచార సంకేతాలు సెల్ టవర్ల నంచి ప్రసారం అవుతాయి. 5జీలో స్మాల్ సెల్ టెక్నాలజీ వాడుతారు. చిన్న బాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్ తో హై బ్యాండ్ సేవలు అందుతాయి. ఐతే ఈ బాక్సులను అమర్చలేని చోట తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రాంతాల్లో సెల్ టవర్లనే వినియోగిస్తారు.

అధికారికంగా ప్రకటించకున్నా 4జీ ఖర్చులతో పోలిస్తే 5జీ ఖర్చులు భారీగా ఉండకపోవచ్చని అంచనా. ఐతే డేటా వేగం పెరుగుతుండడంతో … వినియోగదారులు 5 జీలో అధికంగా డేటాను వినియోగించే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా టెలికం కంపెనీలకు ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే.. ఛార్జీలు పెంచకున్నా, కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇప్పటిదాకా టెలికం రంగంలోని 1జీ నుంచి 4జీ దాకా   ప్రతిసారీ నెట్ వర్క్  సదుపాయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. 5 జీలో మాత్రం దేశీయంగా ఉత్పత్తిచేసిన పరికరాలనే వాడుతున్నారు.

5జీ సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్‌ ముఖేశ్ అంబానీ తెలిపారు. టెలికాం రంగంలో నాయ‌క‌త్వ పాత్ర‌ను పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. ఇక నుంచి ఇండియ‌న్ మొబైల్ కాంగ్రెస్, ఆసియా మొబైల్ కాంగ్రెస్ కావాల‌ని, అదే గ్లోబ‌ల్ మొబైల్ కాంగ్రెస్‌గా అవ‌త‌ర‌లించాల‌ని ముఖేశ్ వెల్ల‌డించారు.

నెక్ట్స్ జ‌న‌రేష‌న్ టెక్నాల‌జీ క‌న్నా 5జీ ఎంతో కీల‌క‌మైంద‌ని చెబుతూ 21వ శ‌తాబ్ధంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, ఇంట‌ర్నెట్‌, రోబోటిక్స్‌, బ్లాక్‌చెయిన్‌, మెటా వ‌ర్స్ లాంటి టెక్నాలజీల‌కు 5జీ టెక్నాల‌జీ ఏమాత్రం తీసిపోద‌ని స్పష్టం చేశారు. ఇవాళ అతి ముఖ్య‌మైన రోజు అని భార‌తి సంస్థ చైర్మ‌న్ సునిల్ భార‌తి మిట్ట‌ల్ తెలిపారు. ఓ కొత్త యుగం ప్రారంభంకానున్న‌ద‌ని, 75వ స్వాతంత్ర దినోత్స‌వ వేళ ఇది జ‌ర‌గ‌డం శుభ‌దాయ‌క‌మ‌ని, 5జీతో ప్ర‌జ‌ల‌కు అనేక కొత్త అవ‌కాశాలు వ‌స్తాయ‌ని సునిల్ మిట్ట‌ల్ తెలిపారు.