వందే భార‌త్ రైలుని జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

వందే భార‌త్ రైలును జెండా ఊపి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  ప్రారంభించారు  . ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో జ‌రిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్ లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర రాజధాని నగరాలను కలుపుతూ నడిచే ఈ రైలులో ప్రయాణించే వారికి విమానంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. 
 
ఈ ప్రయాణంలో రైల్వే కుటుంబానికి చెందిన వారు, మహిళా పారిశ్రామికవేత్తలు. యువకులతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఆయన  సహ-ప్రయాణికులు అని పిఎమ్‌ఒ తెలిపింది. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ కేపిటల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆకుపచ్చ జెండాను ఊపి మోదీ ఈ రైలును ప్రారంభించారు. 
 
ఇది సెమీ హై స్పీడ్ రైలు. మన దేశంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇది మూడోది. మొదటి రైలును న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడుపుతున్నారు. మరో రైలును న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా రూట్‌లో నడుపుతున్నారు.  రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన ట్వీట్‌లో, భావి తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
 
గాంధీ నగర్, ముంబై మధ్య వేగంగా ప్రయాణికులను వందే భారత్ రైలు చేరవేయనుంది. ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. భద్రత కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. 
గాంధీ నగర్ – ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు అక్టోబరు 1 నుంచి అందుబాటులో ఉంటుంది. ఆదివారాల్లో దీని సేవలు అందుబాటులో ఉండవు. షెడ్యూలు ప్రకారం ఈ రైలు ముంబై సెంట్రల్ స్టేషన్‌ నుంచి ఉదయం 6.10 గంటలకు బయల్దేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ నగర్ చేరుకుంటుంది.
గాంధీ నగర్‌లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయల్దేరి, రాత్రి 8.35 గంటలకు ముంబై సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ ఎగ్జిక్యూటివ్ చైర్‌ కార్‌ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.2,505; చైర్ కార్‌కు రూ.1,385 వసూలు చేస్తారు. ఈ రైలులో 16 బోగీలు ఉంటాయి. 
 
రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు. 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లను అమర్చారు. కోచ్ వెలుపలి భాగంలో ప్లాట్ ఫామ్ సైడ్ కెమెరాలు, వెనుక భాగంలో కెమెరాలు అమర్చారు. దీంతో పైలట్లు కోచ్ పక్కన, వెనుక భాగంలోనూ ఏం జరుగుతుందో వీటి సాయంతో తెలుసుకోవచ్చు.
 
 సంప్రదాయ రైళ్లతో పోలిస్తే 30 శాతం తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. ఇంకా వైఫై, మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ సదుపాయాలు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మన దేశంలోనే డిజైన్ చేశారు. కేవలం 140 సెకండ్లలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 
 
బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ పర్యవేక్షణ కోసం కోచ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. జీఎస్ఎం/జీపీఆర్ఎస్ ద్వారా కంట్రోల్ సెంటర్/మెయింటెనెన్స్ స్టాఫ్ మధ్య కమ్యూనికేషన్, ఫీడ్‌బ్యాక్ కోసం ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.