హింస‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవ‌ద్దు

హింస‌తోకూడిన ఆహారాన్ని తీసుకోవ‌ద్ద‌ని  రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహ‌న్ భ‌గ‌వ‌త్ సూచించారు.  ప్రతి ఒక్కరూ తప్పుడు ఆహారం తీసుకోరాదని చెబుతూ హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలని సూచించారు. మాంసాహారం తీసుకొనేవారు కొంత `క్రమశిక్షణ’ అవలంబించడం ద్వారా మానసికంగా తమ దృష్టి మళ్లించకుండా చేసుకోవచ్చని తెలిపారు. 
 
భారత్ వికాస్ మంచ్ ఆధ్వర్యంలో నాగపూర్ లో  నిర్వహించిన కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస అంశంపై భగవత్ మాట్లాడుతూ.. ‘‘మీరు తప్పుడు ఆహారాన్ని తీసుకుంటే అది మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది. తామసంతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు. హింసతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోరాదు’’అని డా. భగవత్ తెలిపారు. తామసంతో కూడిన ఆహరం అంటే మాంసాహారంగా భావిస్తారు. 
 
మాంసాహారం విషయంలో పాశ్చాత్యులు, భారతీయుల మధ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన  ప్రస్తావిస్తూ ప్రపంచంలో ఇతరుల మాదిరే భారత్ లోనూ మాంసాన్ని తినేవారుని పేర్కొన్నారు. కానీ, మన దేశంలో మాంసాహారులు సైతం తమను కొంత నియంత్రించుకుంటూ, కొన్ని నియమాలను పాటిస్తుంటారని చెప్పారు. 
 
మన దేశంలో మాంసాహారులు శ్రావణ మాసం మొత్తం దానికి దూరంగా ఉంటారని, సోమవారం, మంగళవారం, గురు లేదా శనివారాలు దాన్ని తీసుకోరు. వారు తమకంటూ కొన్ని నియమాలను పెట్టుకున్నార‌ని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో, ఈ సందర్భంగా చాలామంది ఉపవాసం ఆచరిస్తూ లేదా మాంసాహారాన్ని త్యజిస్తూ ఉండే సయమంలో ఆయన ఈ వాఖ్యలు చేయడం ప్రాముఖ్యతను సంతరింప చేసుకున్నాయి. 
 
‘ఆధ్యాత్మికత భారతదేశానికి ఆత్మ’ అని చెబుతూ, “ఇతర దేశాలు వ్యాపార అవకాశాలను కనుగొనడంలో ఆసక్తి చూపుతున్నప్పుడు శ్రీలంక, మాల్దీవులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం భారతదేశం మాత్రమే ఆదుకుందని డా. భగవత్ గుర్తు చేశారు. 
చైనా, అమెరికా, పాకిస్థాన్ వంటి దేశాలు శ్రీలంకలో వ్యాపార అవకాశాల కోసం తమ దృష్టిని మళ్లించాయని ఆయన పేర్కొన్నారు. “అయితే ఇప్పుడు శ్రీలంక కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరు సహాయం చేస్తున్నారు? ఇది భారతదేశం మాత్రమే. మాల్దీవులు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అక్కడికి నీటిని పంపింది ఎవరు? అది చేసింది భారతదేశం. ఇది ఆధ్యాత్మిక భారతదేశం” అని ఆయన వివరించారు.
 
  “ఆధ్యాత్మికత భారతదేశానికి ఆత్మ, భారతదేశం ఏమి చేయాలి? ఈ ఆధ్యాత్మికత ఆధారంగా జీవితాన్ని ఎలా గడపాలో ప్రతి ఒక్కరికీ మన స్వంత ఉదాహరణ ద్వారా చెప్పడమే” అని ఆయన తెలిపారు. “అహం లేకుండా జీవించడం” భారతదేశ ఆత్మ అని ఆయన చెప్పారు.