భారత్‌ తోడో ఎవరో.. జోడో ఎవరో ప్రజలకు తెలుసు

భారత్‌ తోడో ఎవరు చేస్తున్నారో… భారత్‌ జోడో ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్‌జోడో ఫ్లెక్సీలను చించేయడం వెనుక రాజకీయకుట్ర ఉందన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఇతర రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను చించేయాల్సిన అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. 
 
ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలంటే ఎవరైనా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన తెలిపారు. సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు రుజువైనందునే కేంద్రం పీఎఫ్ఐపై నిషేధం విధించిందని చెబుతూ ఈ సంస్థ రాజకీయ విభాగం ఎస్‌డీపీఐపై నిషేధానికి సంబంధించి రానున్న రోజుల్లో కేంద్రం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 
 
సమాజంలో శాంతికి విఘాతం కలిగించే ఏ సంస్థ అయినా సరే నిరార్ధక్ష్యింగా చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. పీఎ్‌ఫఐ నిషేధం రాజకీయ గిమ్మిక్‌ అంటూ విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ అయన నోటి ద్వారా ఇంతకంటే ఎలాంటి వాఖ్యానాలు వినగలమని ఎద్దేవా చేశారు. 
 
పీఎఫ్ఐ ఆగడాలు గత కొన్ని సంవత్సరాలుగా కళ్లముందే కనిపిస్తున్నాయని, కాంగ్రెస్‌  ఎమ్మెల్యేలు అఖండ శ్రీనివాసమూర్తి, తన్వీర్‌ సేఠ్‌ కూడా బాధితులేనని సీఎం గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్‌ నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాస్తవాలను చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. 
 
పీఎఫ్ఐ నిషేధం తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎక్కడా అవాంఛనీయ సంఘనటలు జరుగలేదని పేర్కొన్నారు. హింసను వదిలి ఆ సంస్థ పదాధికారులు, కార్యకర్తలు ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు.