పోలవరం నీటితో భద్రాచలం ముంపు వాదనను కొట్టి పారవేసిన కేంద్రం

పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల ఇటీవల భద్రాచలం దేవాలయం మునిగిపోయిందని తెలంగాణ ప్రభుత్వం తలెత్తుతున్న భయాందోళనలను కేంద్ర జలసంఘం తోసిపుచ్చింది. దీనిపై తాము ఇప్పటికే అధ్యయనం చేయించామని, పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ఎలాంటి ముప్పూ లేదని జల సంఘం అధికారులు స్పష్టం చేశారు. 
 
2009లో, 2011లో ముంపు సమస్యలపైన సమగ్ర సర్వేలు నిర్విహించినందున మళ్లీ సంయుక్త సర్వే అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. అయితే,  ప్రాజెక్టును ఆపాలని తాము అనడం లేదని, గోదావరి నది రక్షణ గోడల ఎత్తును మరింత పెంచాలని మాత్రమే కోరుతున్నామని తెలంగాణ తెలిపింది. 
 
ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ, ముంపు సమస్యలపై ఒడిసా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరిపి పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. 
 
ఈ భేటీలో నాలుగు రాష్ట్రాలూ పాతపాటే పాడుతూ పలు రకాల అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల ఇటీవల భద్రాచలం దేవాలయం మునిగిపోయిందని తెలంగాణ ప్రస్తావించింది.
పర్యావరణ అంశాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని, కరకట్టలను తాము అనుమతించే ప్రసక్తే లేదని ఛత్తీస్‌గఢ్ తెలిపింది.
ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలున్నాయని ఒడిసా ఆరోపించింది. 50 లక్షల క్యూసెక్కుల వరదను వదిలేలా స్పిల్‌వే నిర్మాణం చేయలేదని తెలిపింది. ‘గోదావరి వరద సజావుగా వెళ్లకుండా వెనక్కి తన్నుతుంది. మేం ఎన్నిసార్లు చెప్పినా ఏపీ/సీడబ్ల్యూసీ యంత్రాంగం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేసినందున మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుకు 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ రూర్కీ నివేదిక చెబుతోందని పేర్కొంటూ,  ఆ నివేదిక ప్రకారం సంయుక్త సర్వే చేయించాలని కోరారు. అయితే.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ఏ చట్టాన్నీ తాము ఉల్లంఘించలేదని ఆంధ్ర అధికారులు తెలిపారు.
 
నాలుగు రాష్ట్రాల వాదనలూ విన్న తర్వాత, వాటిలో సాంకేతిక అంశాలకు సంబంధించిన సందేహాలున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి అక్టోబరు 7న నాలుగు రాష్ట్రాల అధికారులతో సమగ్రంగా సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించాలని, ఆ భేటీలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పంకజ్‌కుమార్‌ జల సంఘాన్ని ఆదేశించారు. 
 
‘సీడబ్ల్యూసీ, ఏపీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఒడిసా లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ చర్చించి, తగిన నిర్ణయం తీసుకోవాలి. మూడునెలల్లోపు ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. ఛత్తీస్‌గఢ్లో చాలా అంశాలు పరిష్కారమయ్యాయి. ప్రజాభిప్రాయ సేకరణ ఒక్కటే మిగిలింది’ అని తెలిపారు.
 
వివరాలన్నీ పారదర్శకంగా ఉండాలని, డేటాను ప్రభావిత రాష్ట్రాలకు అందించాలని జలసంఘానికి, ఆంధ్రకు సూచించారు. కాగా.. పోలవరం వల్ల ముంపు, పర్యావరణ సమస్యలపై ఒడిసా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలతో పాటు రేలా సంస్థ, తెలంగాణ మాజీ ఎమెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబరు 7కి వాయిదా వేసింది. ఈలోపు 4 రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు అవకాశాలున్నాయని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు