మహాశివుడు తపమాచరించిన విరూపాక్ష దేవాలయం

బి. నరసింహమూర్తి
హంపి – విజయనగరం – 3
హంపి పర్యటనలో ఎన్నో విషయాలు తెలిసాయి. భౌగోళికంగా హంపి శత్రు దుర్భేద్యమైన ప్రదేశం. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళున్న గుట్టలు, ఉత్తరాన తుంగభద్రా నది. ఆ కొండల మధ్యలో ఒక విశాల భూభాగం. అందులో కూడా కొండలు. అందుకే విజయనగరంపై ఎవరూ దాడి చేయలేక పోయారు.
అసలు ఆ స్థలం‌ విశిష్టతను హంపి స్వామి చాలా వివరంగా చెప్పారు. సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞంలో దూకి తనువు చాలిస్తే, పరమ శివుడు కోపోద్రిక్తుడై, తన జటాజూటం పెరికి వీరభద్ర సృష్టి చేసి, యావత్ యజ్ఞాన్నీ నాశనం చేశారు. తన పత్ని శవాన్ని భుజాన వేసికొని తాండవం చేస్తుంటే, భూ నభోంతరాలు దద్దరిల్లాయి.
 
మహా విష్ణువు ఆ శరీరాన్ని 51 ముక్కలు చేస్తే అవి భారత వర్షం అంతా ఒక్కో ముక్క పడ్డాయి. అవే అమ్మవారి శక్తి పీఠాలుగా మారాయి. శాంతించిన శివుడు మనః శాంతికై భారత దేశం లో హంపీ ప్రాంతాన్ని ఎంచుకుని‌ తపో మగ్నుడైనాడు. తనపై పూ శరాల్ని సంధించిన మన్మధుని తన మూడో కంటి మంటతో దహనం చేసాడు.
అతని భార్య వినతి మేరకు మన్మధునికి పునర్జన్మ నిచ్చి రతీదేవికే కనపడే అనంగునిగా సృష్టించాడు. ఆ కన్ను శాంతించింది. అందుకే పరమశివుడు విరూపాక్షుడు అయ్యాడు. పర్వత రాజు పుత్రికగా జన్మించిన పార్వతిని‌ పరిణయమాడి, కుమార సంభవం, రాక్షస వధ తరువాతి కథ.
ఆ విరూపాక్షుడి దేవాలయం అక్కడ వెలసింది. కృష్ణదేవరాయలు వైష్ణవుడని చదివిన నేను విరూపాక్షుడంటే విష్ణు రూపంగా భావించేవాడిని. కానీ విరూపాక్షుడంటే మహేశ్వరుడని అక్కడ లింగం‌పై చందనంతో గీయబడ్డ కన్ను‌ను చూసాక తెలిసింది. ఆ కన్ను శాంతిఫజేయటానికి చందనం పెడతారని స్వామీజీ చెప్పారు.
శివుడు హిమాలయాలలో తపమాచరించాడని చదువుకున్నాము. కానీ ఇక్కడా కొంత కాలం ఉన్నాడేమో ? విరూపమైన నేత్రం కలిగిన లింగాకారంగా చూడటం అదృష్టం. విశాల దేవాలయం. విరూపాక్షుడితో పాటుగా భువనేశ్వరీ అమ్మ వారు, దక్షిణాభిముఖంగా శివుడినే దర్శిస్తూ కనపడుతుంది.
 
విరూపాక్ష దేవాలయం, నాలుగువైపుల గోపురాలతో, విశాల ప్రాంగణం. ఉత్తరాన పుష్కరిణి. ఇక్కడికి తుంగభద్ర నీరెలా చేరుతుందనేది విస్మయం కలిగించే విషయం.  ఇది ఒక చిన్న పుణ్యక్షేత్రంగా ప్రారంభమై, తరువాత విజయనగర పాలనలో ఒక పెద్ద సముదాయంగా అభివృద్ధి చెందింది. హోయసల, చాళుక్యుల పాలకుల ఏలుబడిలో తరువాతి సంవత్సరాలలో విరూపాక్ష దేవాలయానికి చేర్పులు చేసినట్లు సూచించే ఆధారాలు ఉన్నాయి.
రాజవంశం పాలనలో పద్నాలుగో శతాబ్దంలో స్థానిక కళ, హస్తకళ, సంస్కృతి అభివృద్ధి చెందాయి. కానీ విజయనగర పాలకుల తర్వాత ముస్లిం చొరబాటుదారులు ఈ అందమైన నిర్మాణాలను కొంతమేరకు ధ్వంసం చేశారు. 1565లో హంపి విధ్వంసంతో పంపా, విరూపాక్ష భక్తుల ఆరాధన అంతం కాలేదు. 19వ శతాబ్దం ప్రారంభంలో టవర్లు, సీలింగ్ పెయింటింగ్‌లతో కూడిన విస్తృతమైన పునర్నిర్మాణాలు జరిగాయి.
ఈ ఆలయంలో ఒక మందిరం లేదా పవిత్ర ప్రార్థనా స్థలం, అనేక స్తంభాలు, 3 అంతరాళాలతో కూడిన హాలు ఉన్నాయి. ప్రాంగణాలు, స్తంభాల మఠం, కొన్ని చిన్న పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని ముఖద్వారాలలో, తూర్పు ద్వారం గొప్పది. ఇది తొమ్మిది అంచెలు, పొడవు 50 మీటర్లు. తూర్పు లోపలి గోపురం మూడు అంతస్తులతో అలంకరించబడి ఉండగా, ఉత్తర గోపురం ఐదు అంతస్థులతో ఉంటుంది. ఉత్తరం వైపున ఉన్న కనకగిరి గోపురం పర్యాటకులను అనుబంధ గర్భాలయాలతో కూడిన చిన్న ఆవరణలోకి తీసుకువెళుతుంది.
ప్రఖ్యాత విజయనగర రాజు, కృష్ణదేవరాయలు హయాంలో ఈ ఆలయంలో అత్యంత అలంకరించబడిన నిర్మాణం ప్రధాన స్తంభాల హాలు నిర్మించారని నమ్ముతారు. మందిరం ప్రక్కన ఒక రాయిపై దీనిలో ఆయన ఆలయానికి సమర్పించిన అర్పణలను వివరించే శాసనాలు ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం చుట్టూ శిథిలమైన మండపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ దేవాలయం ముందు మండపాలతో ఒక పురాతన కొనుగోలు కేంద్రం ఉంది. దాని శిథిలాలు నేడు నిలిచి ఉన్నాయి.