యోగా ద్వారా విశ్వగురుగా భారత్.. అదే మోదీ లక్ష్యం 

యోగా ద్వారా విశ్వగురుగా భారత్.. అదే మోదీ లక్ష్యం 
యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం మాత్రమే కాకుండా యోగా ద్వారా భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురు స్థాయిలో తీసుకెళ్లడమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన లక్ష్యం అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.  కన్హా శాంతి వనంలో “12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని – 50 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమంలో శనివారం పాల్గొంటూ  యోగా మన భారతదేశ ప్రాచీన వారసత్వం మాత్రమే కాకుండా యావత్ మానవాళికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన ఆరోగ్య కానుక అని స్పష్టం చేశారు. 
 
విశ్వ గురువుగా మనం కీలక పాత్ర పోషించాలంటే మన దేశ యువత పోషించాల్సినటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమం ఇదని తెలిపారు. అంతేకాకుండా, మనం అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్ గా ఆవిర్భవించాలంటే, 2047 నాటికి ఆరోగ్యవంతమైన, ఒక శాంతివంతమైన భారతదేశాన్ని మనం నిర్మించాలంటే ఆ దిశలో భారతదేశ యువత కూడా ముందుకు రావాలని పిలుపిచ్చారు. 
 
క్రమశిక్షణతో మనం చేస్తున్నటువంటి మన వృత్తులు, మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలంటే యోగా చేయాలని స్పష్టం చేశారు. మనం తీసుకున్నటువంటి ఆహారం, మనం పీలుస్తున్నటువంటి గాలి, ఎదుర్కొంటున్న వత్తిడిలను తట్టుకోవాలంటే యోగా చేయాలని సూచించారు. మనం పీల్చే గాలి, తీసుకొనే ఆహారం, తాగే నీరు… అన్నింటా కాలుష్య జీవనం గరుపుతున్నామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి అద్భుత పరిష్కారం యోగా మాత్రమే అని తెలిపారు. 
 
మనము ప్రకృతితో మమేకమై జీవించడమే భారతీయ సంస్కృతి అని పేర్కొంటూ తెలంగాణలో ప్రతి స్కూలు, ప్రతి గ్రామము, ప్రతి కాలేజీ, ప్రతి యూత్ ఆర్గనైజేషన్, ప్రతి పొదుపు సంఘం, ప్రతి ఎన్జీఓ, ప్రతి కార్యాలయం..  అన్నిట్లో కూడా యోగాను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో యోగా, ప్రతి యువకుడిలో క్రమశిక్షణ రావాలని చెప్పారు.  యోగాను ఇంటింటికి రోజువారి కార్యక్రమంలో భాగంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.