జర్నలిజం అనేది ఒక ఉత్తమ రూపంగా చేసే ప్రజా సేవ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి కొనియాడారు. సమాచార భారతి ఆధ్వర్యంలో జరిగిన నారద జయంతిలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ దేశం అంతరాత్మను మలిచే బాధ్యతను, దేశానికి అవసరమైన అసలైన విషయాలను గుర్తించి సమాజానికి తెలియజేసే బాధ్యతను గుర్తించే రోజు ఇదని తెలిపారు.
ఇది ‘ధైర్యానికి’, ‘సత్యానికి’, ‘బాధ్యతాయుతమైన జర్నలిజం శక్తికి ” జరుగుతున్న ఉత్సవం అని చెప్పారు. మానవ హక్కుల కమిషన్ ప్రారంభం నుంచీ మీడియా శక్తిని, సేవలను వినియోగించుకుందని ఆమె తెలిపారు. మానవహక్కుల పరిరక్షణ, ప్రోత్సాహంలో మీడియాని కూడా భాగస్వామిగా భావిస్తున్నదని పేర్కొన్నారు. మీడియా ఇచ్చే నివేదికలను విశ్వసిస్తూ, మీడియా కథనాలను సుమోటోగా కూడా స్వీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తూ పోలవరం నిర్వాసితులు, సందేశ్ కాలీ సహా పలు సంఘటనలను ఆమె ఉదహరించారు.
సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ జి గోపాల్ అధ్యక్షత వహిస్తూ వక్రీకరణ జరిగిన భారతదేశ చరిత్రను సరైన దిశలో ప్రపంచానికి తెలియజేయడానికి సమాచార భారతి కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే పాత్రికేయ మిత్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సోషల్ మీడియా సంగమాలు, పాత్రికేయ శిక్షణా శిబిరాలు వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.
పాత్రికేయులను సత్కరించేందుకు ప్రతి ఏటా సమాచార భారతి నారద జయంతి జరుపుతున్నదని, ఈ వేడుక ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను మరోసారి మననం చేసుకునే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా నారద మహాముని గురించి పాత్రికేయులు ప్రచారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాలోని వివిధ విభాగాలకు చెందిన పలువురు జాతీయవాద జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానోత్సవం జరిపారు.
పురస్కారాలను అందుకున్నవారిలో ‘వార్త’ దినపత్రిక సంపాదకులు దామెర్ల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్ జంధ్యాల శరత్ బాబు, మహిళా జర్నలిస్టు-వీడియో బ్లాగర్ వల్లీ పద్మాంజలి (అంజలి), సీనియర్ కార్టునిస్ట్ సరస్వతుల రామ నరసింహం (సరాసి), ఐన్యూస్ చానెల్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్, రాజ్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ లక్ష్మి ఉన్నారు.

More Stories
యోగా ద్వారా విశ్వగురుగా భారత్.. అదే మోదీ లక్ష్యం
రవి ప్రకాష్, ఆర్ టీవీకి సిటీ సివిల్ కోర్ట్లో ఎదురు దెబ్బ
క్లైమాక్స్ కు చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు