కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా నగలు దోపిడీ

కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా నగలు దోపిడీ
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెల్లరీ షాపులోకి చొరబడిన ఐదుగురు దుండగులు, సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ గౌస్‌ ఆలం విచారణను ముమ్మరం చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ సిబ్బంది షాపు తెరిచి లాకర్ల నుంచి డిస్‌ప్లేలో నగలు పెడుతున్నారు.
ఆ సమయంలో రెండు బైక్‌లపై ఐదుగురు దుండగులు షాపులోకి ప్రవేశించారు. తుపాకులు చూపించి నగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.  షాపు సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించగా, దొంగలు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల శబ్ధంతో షోరూమ్ లోపల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దుండగుల దాడిలో ఐదుగురు షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
భద్రతా సిబ్బందిని, సేల్స్ మెన్‌లను భయభ్రాంతులకు గురిచేసిన దొంగలు, షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలిలో కొన్ని బుల్లెట్‌ షెల్స్‌, తుపాకీ మ్యాగజైన్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి, అదును చూసి ఎటాక్‌ చేశారని భావిస్తున్నారు. 

హడావుడి తక్కువగా ఉంటుందనే ఉదయాన్నే దోపిడీకి ప్లాన్‌ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. పట్టపగలే, రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి దోపిడీ జరగడం సంచలనంగా మారింది.