సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని సభకు భూమి పూజ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని సభకు భూమి పూజ
మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యలో ఏర్పాటు చేస్తున్న వేదిక వద్ద బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డా. కె. లక్ష్మణ్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ మే 10న జరగబోయే ఈ బహిరంగ సభకు రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే పార్టీ నాయకులు జిల్లాల వారీగా పర్యటిస్తూ సభకు భారీ స్పందన తీసుకురావడానికి కృషి  చేస్తున్నారని,రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో, ప్రజల్లో గొప్ప ఉత్సాహం కనిపిస్తుందని చెప్పారు.

ఎన్నికల అనంతరం మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణకు రావడం విశేషం. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారని తెలిపారు. తెలంగాణకు ప్రధాని మోదీ రావడం గొప్ప అవకాశంగా భావిస్తూ, వారికి ఘన స్వాగతం పలకాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

 
దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను, బిజెపి విధానాలను, నరేంద్ర మోదీ సుపరిపాలన, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా రాజకీయంగా పెద్ద మార్పు రావాలని, ప్రజలు బిజెపి వైపు నిలుస్తారని బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.