బెంగాల్ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని, దేశంలో విభజన రాజకీయాలు చేసిన డీఎంకేకు సైతం తమిళ ఓటర్లు బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీనే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు కాంగ్రెస్‌కు, ఇండి కూటమికి మహిళలు గుణపాఠం చెప్పారని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు, యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ బెంగాల్‌లో టీఎంసీ పదిహేనేళ్లుగా రాజకీయ హింసను ప్రేరేపించిందని ఆరోపించారు. ఇప్పుడు అక్కడి ప్రజలు ఆ పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. బీజేపీ ఏ మతానికీ, ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, బెంగాల్ విజయం స్ఫూర్తి తో తెలంగాణలోనూ ప్రధాని మోదీ నేతృత్వంలో అందరం కలిసికట్టుగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీకి సానుకూల ప్రభావం చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసంలో విజయోత్సవాలను నిర్వహించారు.
అనంతరం, తెలంగాణ భవన్ వరకు కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా వెళ్లి అక్కడ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లలో తృణమూల్ ప్రభుత్వం బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిందని, సీఎంగా రేవంత్ పగ్గాలు చేపట్టాక కూడా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన విమర్శించారు.
బెంగాల్ లో కోల్ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని, వేలాది కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. బెంగాల్ లోని బొగ్గు గనుల్లో టీఎంసీ అరాచకత్వం సృష్టించింది. బొగ్గు గనుల్లో మమతా బెనర్జీ, అక్కడి మంత్రులు అక్రమంగా బొగ్గు ఉత్పత్తి చేసి, అక్రమంగా అమ్ముకొని కోట్లు దండుకున్నారని ఆరోపించారు.
ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లోమండిపడ్డారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

More Stories
ఫార్ములా ఈ కారు రేసు కేసులో జులై 31న విచారణకు కేటీఆర్
ప్రధాని సప్త సూత్రాలు ప్రజల భాగస్వామ్యంతో అమలు కావాలి
మావోయిస్ట్ నేత నరహరి భార్యతో సహా లొంగుబాటు?