“జైశ్రీరామ్ అంటే పై నుంచి డబ్బులు పడతాయా?” తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బిజెపి భగ్గుమంటున్నది. మంత్రి మాటలు కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేవాదాయ శాఖకు బాధ్యత వహిస్తూ భక్తిని, దైవ నామాన్ని ధనంతో పోల్చడం ఆమె అహంకారానికి నిదర్శనమని కమలం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“బీజేపీవాళ్లు ఏమైనా మీటింగులు పెట్టుడు. జైశ్రీరామ్ అనుడు. జైశ్రీరామ్ అంటే పై నుంచి ఏమైనా పైసలు పడుతున్నయా.. లేకపోతే మనకేమన్నా పథకాలొస్తున్నాయా..? ఇంకేమైనా వస్తున్నయా అంటే ఏమీ లేదు” అంటూ ప్రధాని మోదీ రాక సందర్భంగా ఈ నెల 10న హైదరాబాద్ లో బిజెపి జరుపతలపెట్టిన బహిరంగసభ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఎద్దేవా చేశారు.
ఆమెను ‘దేవాదాయ శాఖ మంత్రి’ అని కాకుండా ‘దైవద్రోహ శాఖ మంత్రి’ అంటూ తీవ్రంగా విమర్శించింది. భగవంతుడి నామాన్ని ఉచ్చరించడాన్ని కించపరచడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి హిందూ దేవుళ్ల పట్ల ఉన్న చులకన భావం మరోసారి బయటపడిందని ఆరోపించింది. పవిత్రమైన రామనామాన్ని వెక్కిరించడం క్షమించరాని నేరమని, అధికార గర్వంతోనే ఇటువంటి మాటలు వస్తున్నాయని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ కావడంతో రాజకీయ సెగలు రాజుకున్నాయి.
తీసుకొస్తరు మోదీతో మీటింగ్ పెట్టిస్తరు. నాలుగు మాటలు హిందీలో మాట్లాడిస్తరు. వెళ్లగొడ్తరు. ఇక్కడున్నట్వంటి ఇద్దరు మంత్రులు చప్పుడు చేయరు. ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారని చెప్పుకొచ్చారు.
“అమ్మా సురేఖ గారు.. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని అడుగుతున్నారు, భక్తిని కూడా పైసలతో కొలిచే నీచమైన సంస్కృతి కాంగ్రెస్ ది. మీ ఢిల్లీ బాసులు ఇటలీ సంస్కృతిలో పెరిగారు కాబట్టి కాంగ్రెస్ నాయకులకు రామనామం విలువ తెలియదు. మోదీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారాలు చేస్తున్న సురేఖ గారు మీ కళ్ళజోడు మార్చుకొని మీ సొంత జిల్లా ఉమ్మడి వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడండి” అంటూ
బిజెపి తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ హితవు చెప్పారు.
“దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి హిందూ ధర్మాన్ని, భక్తుల విశ్వాసాలను అవహేళన చేయడం దారుణం. రాష్ట్రంలో దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఎన్నో ఆలయాలు ఉన్నాయి, వాటికి చిల్లిగవ్వ కేటాయించలేని మీరు దేవుడి నామాన్ని అవమానిస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీకే అధికారం
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని సభకు భూమి పూజ
కరీంనగర్లోని జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా నగలు దోపిడీ