2047 నాటికి ఇస్లామిక్ దేశంగా భారత్… పిఎఫ్ఐ లక్ష్యం

భారతదేశాన్ని 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) లక్ష్యంగా పెట్టుకుందని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఎటిఎస్) అధిపతి వినీత్ అగర్వాల్ తెలిపారు. విద్వేషపూరిత నేరాలకు పాల్పడాలని ఈ సంస్థ తన సభ్యులను ప్రేరేపించిందని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
అందుకోసం ఆ సంస్థ ఓ ప్రణాళికను రచించి, అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తన సభ్యులను రెచ్చగొట్టేందుకు ఈ సంస్థ పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చేవారని,  విద్వేషపూరిత నేరాలకు పాల్పడాలని ప్రేరేపించేవారని తెలిపారు.
స్వీయ రక్షణ కోసం ఇళ్ళ పై కప్పులపై రాళ్ళు, ఇటుకలు, ఇతర పదునైన వస్తువులను పెట్టుకోవాలని చెప్పేవారని తెలిపారు.  తాము సాంఘికాభివృద్ధి కార్యకర్తలమని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లమని పీఎఫ్ఐ నాయకులు ఆ సంస్థ సభ్యులకు  చెప్పేవారని, వారిని రెచ్చగొట్టేవారని వివరించారు.
పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ నిర్దిష్టంగా కొందరిని ఎంపిక చేసుకుని చంపడం వీరు నేరాలకు పాల్పడే విధానమని తెలిపారు. వీరి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని చెప్పారు.  పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని, ఆ తర్వాత ఈ సంస్థ రద్దయిందని తెలిపారు.
ఈ సంస్థ సభ్యులు మళ్లీ మరొక సంస్థను ఏర్పాటు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధ వేదిక ద్వారా మినహా ఇతర విధాల్లో నిరసనలు తెలియజేయడానికి అవకాశం ఉండదని చెప్పారు.  పీఎఫ్ఐ కార్యకలాపాలపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్లకు, జిల్లా మేజిస్ట్రేట్లకు అధికారాలు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు,  కర్ణాటకలతో  సహా ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి ఆదేశాలను జారీ చేశాయి.
కర్ణాటక డిజిపి హెచ్చరిక 
 
కాగా, పీఎఫ్ఐను నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్రంలోను అమలులోకి వచ్చినట్టేనని డీజీపీ ప్రవీణ్‌సూద్‌ తెలిపారు. రాష్ట్రంలో పీఎఫ్ఐని కొనసాగించినా, ఆ పేరిట ఎటువంటి కార్యకలాపాలు సాగినా, నిరసనలకు దిగినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పీఎఫ్ఐ నిషేధంపై జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేస్తామని పేర్కొన్నారు. 
 
ఇప్పటికే పలు ప్రాంతాల్లో పీఎఫ్ఐకు అనుబంధమైన కార్యాలయాలపై దాడి చేసి ముఖ్యులను అరెస్టు చేశామని తెలిపారు. నిషేధిత సంస్థ పేరిట నిరసనలు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. బెన్సన్‌టౌన్‌లోని పీఎఫ్ఐ ప్రధాన కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని చెబుతూ ఇకపై పీఎఫ్ఐ పేరు ఎవరూ వినియోగించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. 
 
తమిళనాడులో హై అలర్ట్ 
 
పీఎఫ్ఐ సంస్థపై కేంద్రప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర పోలీసుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ సంస్థ కార్యాలయాలు, సంస్థ నిర్వాహకుల నివాసాల వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 
 
ఇటీవల దేశవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలు, నిర్వాహకుల నివాసాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించిన సమయంలో వాటిని నిరసిస్తూ రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరుప్పూరు, మదురై, పొల్లాచ్చి, మేట్టుపాళయం ప్రాంతాల్లో బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌, హిందూమున్నని నేతల నివాసాలపై పెట్రోలు బాంబులతో దాడులు జరిగాయి. 
 
పురుషవాక్కం మూక్కాత్తాళ్‌ వీధిలో ఉన్న ఆ సంస్థ రాష్ట్ర విభాగం కార్యాలయం వద్ద బుధవారం ఉదయం సుమారు పదిహేను మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఇదే విధంగా మన్నడి, ట్రిప్లికేన్‌, ఐస్‌హౌస్‌, జామ్‌బజార్‌ తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా వేస్తున్నారు.