హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్.. మరో మూడు రోజులు వర్షం

వాతావరణ శాఖ హైదరాబాద్ నగరంకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నగరంలో గురువారం 6.4 నుంచి 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్ లో బుధవారం  మరోసారి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.

హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఎల్ బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు విజయవాడ నేషనల్ హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఆటోనగర్, చింతలకుంట, వనస్థలిపురం, పనామా పారంతాల్లో రోడ్లపై నడుములోతు నీరు నిలిచింది. చింతలకుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి. మరోసారి నాగోల్ అయ్యప్పనగర్ కాలనీలో ఇండల్లోకి వర్షపు నీరు చేరింది.

పీర్జాదిగూడలోని పలు కాలనీలను మూడు రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది. ఇండ్ల నుంచి బయటికి రాలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఖైరతాబాద్ లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ లోకి వరద నీరు చేరింది. డ్రైనేజీ పనులు చేయకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 మరోసారి పిడుగులు నలుగురి ఉసురు తీశాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో నిన్న కురిసిన వర్షానికి పిడుగుపడి ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో పిడుగుపడి అలాట చంద్రమౌళి అనే వ్యక్తి చనిపోయాడు. చంద్రమౌళితో పాటు అతని రెండు ఎడ్లు చనిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం శివారులో పిడుగుపడి కొమ్ము సత్తన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయాడు.