రంగారెడ్డి జిల్లా కోర్ట్ లో కవితకు చేదు అనుభవం

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కు రంగారెడ్డి జిల్లా కోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ ఆడపడుచుల్లో ఉత్సహం నింపుతున్నారు.
 
ఇక ఎమ్మెల్సీ కవిత సైతం అనేక చోట్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ తరుణంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టుఆవరణలోకి వెళ్లగా..అక్కడ పలువురు న్యాయవాదులు ఆమెను అడ్డుకున్నారు.
 
తమ సమస్యలు ఎప్పుడూ పట్టించుకోని మీర ఇప్పుడెలా వస్తారంటూ న్యాయవాదులు నిలదీశారు. కల్వకుంట్ల కవిత గో బ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. న్యాయవాదుల హత్యలపై స్పందించని ఎమ్మెల్సీ కవిత గో బ్యాక్ అంటూ కొందరు న్యాయవాదులు నినాదాలు చేశారు. న్యాయవాదులకు కవిత ఏం చేశారని, ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా  న్యాయవాదులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు న్యాయవాదులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ న్యాయవాదులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని స్టేషన్ కు తరలించారు.

ఎమ్మెల్యే రాజయ్య కు చేదు అనుభవం

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గంలోని జఫర్ఘడ్ మండలం ఓబులాపూర్ లో బతుకమ్మ చీరలు, పెన్షన్ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రాజయ్యను స్థానిక దళితులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో దళిత బంధుపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
 
దళిత బంధుకు టీఆర్ఎస్ వాళ్లను ఎంపిక చేస్తున్నారంటూ వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దళిత బంధు ఇప్పిస్తామంటూ స్థానిక టీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు.
 
అయితే తాము అధికారంలో ఉన్నామని, తమ పార్టీ వాళ్లకే దళిత బంధు ఇచ్చుకుంటామని అక్కడున్న టీఆర్ఎస్ నేతలు చెప్పడంతో… తమకు దళిత బంధు ఇవ్వారా అంటూ ఇతర పార్టీలకు చెందిన దళితులు  ఫైరయ్యారు. దీంతో ఎమ్మెల్యే సమక్షంలోనే దళితులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట  జరిగింది.