టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించిన కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఏడు గంటల పాటు ప్రశ్నించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతీయ కార్యాలయంలో ఈడీ అధికారుల ఎదుట  హాజరయ్యారు.
 
కిషన్ రెడ్డి హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కూడా వ్యవహరిస్తున్నారు.  కిషన్రెడ్డి ఫెమా చట్టం ఉల్లంఘించినందుకు ఈడీ కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
 
కిషన్ రెడ్డి ఇతర ప్రాంతాలకు వెళ్లి క్యాసినోలో పాల్గొన్నారని, హవాలా, మనీలాండరింగ్‌ ద్వారా డబ్బులు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో విదేశాల్లో వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.  రాజ‌కీయ‌, వ్యాపార రంగాలతో పాటు ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో క్యాసినో ఆడిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్‌పై కేసు న‌మోదు చేసిన ఈడీ అధికారులు ఆయ‌న‌ను ఇదివ‌ర‌కే విచారించిన సంగ‌తి తెలిసిందే.
 
చీకోటి ప్ర‌వీణ్ విచార‌ణ‌లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఏడుగురు రాజ‌కీయ నేత‌ల‌కు ఈ వ్య‌వ‌హారంలో ప్రమేయం ఉన్న‌ట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేక‌రించిన‌ట్లు గ‌తంలో వార్తలు వ‌చ్చాయి. ఈ ఏడుగురికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో మంచిరెడ్డి కూడా ఉన్నారు.
 
గోల్డ్ మైన్‎కు సంబంధించిన వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన అప్పుడు ఇచ్చిన సమాధానాల పట్ల  ఈడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దానితో మరోసారి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.  ఆయన  బ్యాంకు లావాదేవీల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించినట్లు సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ ముఖ్యనేతల్లో కిషన్‌రెడ్డి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.

కాగా, కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి అక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు.  దళితులు, పేదల భూములను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆక్రమించుకుని కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించారని రంగారెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి కూడా కాసినోలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.