ఖైరతాబాద్​లో దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మహిళలు

ఖైరతాబాద్​లోని చింతల్​ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చింతల్​ బస్తీ రాంలీల మైదానంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ప్రతిమను మంగళవారం ఉదయం  కొంతమంది ముస్లిం మహిళలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ విగ్రహాన్ని సోమవారమే ప్రతిష్టించి ఘనంగా పూజలు చేశారు.

ముస్లిం మహిళలు ధ్వంసం చేయడం అక్కడ కాపలాగా ఉన్న బాలుడు చూశాడు. వారిని అడ్డుకోవడానికి యత్నించిన ఆ బాలుడిని సుత్తెతో దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన బుర్కా ధరించిన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి నేరుగా దగ్గర్లోని చర్చిలోకి వెళ్లి అక్కడున్న మేరీమాత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.  ఈ దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న బాలుడు వెంటనే స్థానికులను పిలిచాడు. ఈ ఘటనపై స్థానికులు సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.

ఆగ్రహంతో ఉన్న ప్రజలను శాంతింపజేసేందుకు పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపులోనే ఉందని సైఫాబాద్ పోలీసులు తెలిపారు. మహిళలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అయితే.. ప్రస్తుతం వారి పేర్లను మాత్రం వెల్లడించడం లేదు.

కాగా, ఈ ఘటనతో స్థానికుల్లో ఉద్రిక్తత నెలకొంది. హిందువుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఇలాంటి ఘటనలు చాలా అరుదు. వార్త తెలియగానే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడ్డ మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రజినీ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మహిళలు బాగా శిక్షణ పొందినట్టు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మహిళలు, ఐదుగురు మగాళ్లు ఈ ఘటనకు పాల్పడ్డట్టు తమకు సమాచారం ఉందని చెప్పారు. వారికి సరైన శిక్షణ లేకుండా ఇట్లా దాడి చేయడం  సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

ఈ విషయంలో హిందువులు, వృద్ధులు, యువకులు, స్త్రీలు, పురుషులు ఏకం కావాలని ఆమె కోరారు. ఈ ఘటనను నిరసిస్తూ బజరంగ్‌ దళ్‌ సభ్యులు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. “వీ వాంట్‌ జస్టిస్‌”.. “పీఎఫ్‌ఐ వాలో కో, గోలీ మారో సాలో కో” వంటి నినాదాలు చేశారు.

దుర్గామాత విగ్రహాన్ని పక్కా ప్రణాళిక ప్రకారమే ధ్వంసం చేసిన్నట్లు స్పష్టంగా తెలుస్తుందని పేర్కొంటూ నిందితులను మతిస్థిమితం లేనివారుగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దని విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర కార్యదర్శి రావినూతల శశిధర్ విజ్ఞప్తి చేశారు. దాడిచేసిన మహిళలు పిఎఫ్ఐ సభ్యులు అంటూ వస్తున్న వార్తలపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
దాడి నుకగల ఉగ్రకోణాన్ని ఛేదించాలని కోరుతూ వారికి మారణాయుధాలు ఎక్కడ నుండి వచ్చాయి? వారికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడానికి సహకరించింది ఎవ్వరో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని శశిధర్ కోరారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.