ఆశ్చర్యం కలిగించే హంపి ఇంజనీరింగ్ వ్యవస్థ

హంపి – విజయనగరం – విరూపాక్ష దేవాలయం- 1

బి. నరసింహమూర్తి
 
దేవాలయం విశాల ప్రాంగణం. దక్షిణానికి కొండ. ఉత్తరం వాలులో దేవాలయం. ఉత్తరాన పుష్కరిణి. అక్కడి‌నుండి ఉత్తరంగా 50 అడుగుల లోతులో తుంగభద్రా ప్రవాహం. ఆలయంలోకి తుంగభద్ర నుండి ఎత్తిపోసే పంపులు లేవు. కానీ సంవత్సరమంతా దేవాలయం నైరుతి మందిరం‌  ప్రక్క నుండి నీటి కాలువ, కప్పువేసి పారుతుంది.
 
అది దేవాలయ తూర్పు గోపురం నుండి‌లోపలికి వచ్చిన ప్రాంగణంలో నాపరాళ్ళు కప్పిన కాలువ గుండా పుష్కరిణి చేరుతాయి. దేవాలయానికి వాయువ్యంలో ఉన్న స్వామి వారి ఆశ్రమం మధ్యలో, దైవ సన్నిధానం ముందు ఓ 6 అడుగుల గుంతలో కూడా నీటి ప్రవాహం. అందులో తాబేళ్ళూ ఉంటాయి. దాని గోడపై తుంగభద్ర నీరు అని వ్రాసి ఉండటం ఆశ్చర్యం!
 
ఇవెలా వస్తాయని? అడిగాను. నీరు పల్లమెరుగు కదా! తుంగభద్ర ఆ ఎత్తు నుండి ప్రవహించే ప్రదేశం నుండి మరలించి ఉంటారని వారు చెబితే ఆశ్చర్యం వేసింది. 5 శతాబ్దాల క్రింద ఇలాంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఉండిందంటే ఆశ్చర్యం‌ కదూ! దేవాలయం చుట్టూ నీటి ప్రవాహం ఉండటం వల్ల ఇక్కడ అంటు, ముట్టు ఉండదని‌ స్వామి చెబుతుంటే సంభ్రమాశ్చర్యాలతో ఒకింత పులకించి పోయాము. 
 
ఈ ప్రవాహ కాలువల పక్కనే నీటి టాంకులు, ఏనుగు‌ లక్ష్మి తాగటానికి ఓ రాతి జలపాత్ర, గుర్రాలకోసం రాతి నీటి పాత్రలు చూస్తే ఆశ్చర్యం వేసింది. పూర్వం దేవాలయాలు అలా ఏనుగుల, గుర్రాల, సైనికుల స్థావరంగా ఉండేదేమో. దేవాలయానికి ఆగ్నేయాన వంటశాల. పొగ పోవటానికి గవాక్షలు. ఇవన్నీ ఆనాడే ఉండేవంటే ఆశ్చర్యం కదూ.
 
గోపురం 12 పలకలుగా నిర్మించిన గోడలతో ఉంది. ఆకర్షణీయమైన శిల్పాలతో నిండి ఉంది. అంతస్తుకు తూర్పుకు ఒకటి పడమటికి ఒకటి విశాల కిటికీలు. ఆనాడు సిమెంట్ లేదు. ఇటుకలను కేవలం మట్టితో కలిపితే వానలకు నాని పడిపోయి ఉండేది.  మరి అందులో ఏమి వేసారో 6-7 వందల సంవత్సరాలుగా చెక్కు చెదరలేదు. గోపురం మద్యలో విశాల ప్రాంగణంగా మొదటి అంతస్తు. కర్రలతో వేసి పైన సున్నం నిఫారేమో ! నిజంగా అది ఇంజనీరింగ్ అద్భుతం!! నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు.
 
తూర్పు గాలి గోపురం ఎదురుగా రాళ్ళతో నిర్మించిన వందల దుకాణాలు. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అనే పాట గుర్తొచ్చింది. అది ఆ నాటి స్వర్ణ యుగాన్ని జ్ఞప్తికి తెస్తుంది. తెలుగు,కన్నడ నాట రాయలు, విజయనగర సామ్రాజ్య వైభవం ఒక్క సారి కలగా కళ్ళలో మెదలుతుంది. అంతరాలయంలో స్థంభాలపై శిల్పాలు, పైకప్పుకు క్రింద సహజ‌ కూరగాయల, పూల రంగులతో భగవంతుని కధల చిత్రాలు. అజంతా చిత్రాలను తలపిస్తున్నాయి.  
 
స్వయంభూ విరూపాక్షుడు, తల్లి భవనేశ్వరీ మాత ను కన్నుల పండుగగా దర్శించి, తీర్థ, విభూతి, కుంకుమ స్వీకరిస్తూ ముందుకు నడిస్తే ఉత్తర భూగృహంలో విద్యారణ్య స్వాముల దర్శనం గొప్ప ఆనందం కలిగించింది.‌
 
నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర !