దసరా ఉత్సవాలు టార్గెట్‌గా పీఎఫ్ఐ భారీ ఉగ్రకుట్ర?

ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ సంస్థ పీఎఫ్ఐ దేశంలో జరగనున్న దసరా ఉత్సవాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న పిఎఫ్ఐ సభ్యులు కొందరిని విచారిస్తున్నసమయంలో ఈ విషయాలు విషయాలు వెలుగు చూశాయి. దసరా సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్‌గా ఉగ్రదాడులు చేయాలని పీఎఫ్ఐ హింసకు భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల దర్యాప్తులో వెల్లడైంది.
మహారాష్ట్ర ఏటీఎస్ పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పీఎఫ్ఐ హిట్‌ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉన్నట్టు సమాచారం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. సంబంధిత కార్యాలయాల దగ్గర భద్రతను పెంచారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్‌గా వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 8 రాష్ట్రాల్లో పలుచోట్ల రెండు దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అస్సాంలో దాడులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు ఆపరేషన్‌లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐబీ, రాష్ట్ర పోలీసులు కూడా కొన్ని చోట్ల పాలుపంచుకున్నట్లు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం తెలిపింది.  ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇలా దేశంలో ఉన్న పీఎఫ్ఐ కార్యకలాపాలపై దాడులు నిర్వహించడం గత రెండు వారాల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఎన్ఐఎ ఆదేశానుసారం, కర్ణాటక పోలీసులు మంగళవారం తెల్లవారుజామున  రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పిఎఫ్ఐ నాయకులను కూడా ముందస్తు కస్టడీలోకి తీసుకున్నారు. బీదర్ జిల్లాలో పీఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ఎస్డీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ మక్సూద్‌లను అదుపులోకి తీసుకున్నారు. కోలార్ జిల్లాలో ఆరుగురు పిఎఫ్ఐ సభ్యులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

మంగళూరులో 10 మందిని అరెస్టు చేసి, వారిపై సిఆర్‌పిసి సెక్షన్ 107, 151 కింద కేసు నమోదు చేశారు. బాగల్‌కోట్‌లో పీఎఫ్‌ఐకి చెందిన ఆరుగురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విజయపురలో పీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అష్ఫాక్ జమఖండిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కన్నూర్ జిల్లాలో వారికి సంబంధించిన దుకాణాలు,  ఇతర సంస్థలతో సహా వివిధ ప్రదేశాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఈరోజు, మట్టనూర్, కన్నూర్ రీజియన్లలో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 23న పిఎఫ్ఐ హర్తాళ్ సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 309 కేసులు నమోదు చేశామని, 1,404 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.