సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను తొలిసారి లైవ్‌లో ప్రసారం చేశారు. శివసేనకు సంబంధించిన కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన కేసును ధర్మాసనం విచారించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న కేసుల్ని లైవ్‌లో ప్రసారం చేయాలని గతవారం సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే.
సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలో గతవారం ఏకగ్రీవం నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ ప్రాధాన్యత కలిగిన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారాలు లేదా వెబ్ కాస్ట్ ద్వారా ప్రసారం చేయాలని సెప్టెంబర్ 27, 2018న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ నేడు కార్యరూపం దాల్చింది.
అయితే యూట్యూబ్‌కు బదులుగా త్వరలోనే స్వంత ఫ్లాట్‌ఫామ్‌పై సుప్రీం విచారణలను లైవ్ చేయనున్నట్లు సీజే లలిత్ పేర్కొన్నారు. ఈ లైవ్ ప్రసారాలను ప్రజలు తమ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో వీక్షించవచ్చు.
ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుగుతుండగా, సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకో ముందడుగు పడింది. కోర్టు కార్యకలాపాలు ఇకపై లైవ్ స్ట్రీమ్ కానున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా సొంత ప్లాట్‌ఫారం ఏర్పాటు కానుంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా సమాచార హక్కు పరిధిలోకి తీసుకు రానుండడం మరో ముఖ్యమైన అంశం.
ప్రస్తుతం కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాల కోసం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొంటూ బీజేపీ మాజీ నాయకుడు కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జె.బి.పార్డీవాలాల ధర్మాసనం పరిశీలించింది.
కోర్టు కార్యకలాపాలను ప్రైవేటు ప్లాట్‌ఫారం ద్వారా నిర్వహించడం సరికాదని గోవిందాచార్య తరఫు న్యాయవాది విరాగ్ గుప్తా వాదించారు. ఈ లైవ్‌స్ట్రీమ్‌పై ఆ సంస్థ కాపీరైట్ హక్కులను అడుగుతుందని చెప్పారు. 2018 నాటి ఓ తీర్పు ప్రకారం న్యాయస్థానాల్లో రికార్డయిన, ప్రసారమయిన మొత్తం సమాచారంపై కాపీరైట్ హక్కు కోర్టుకే ఉంటుందని గుర్తు చేశారు.
యూట్యూబ్ నిబంధనల ప్రకారం ఆ సంస్థకు కూడా కాపీరైట్ కోరే హక్కు ఉందని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ యూట్యూబ్‌ను ఉపయోగించడం తాత్కాలిక ఏర్పాటేనని తెలిపింది. సొంత ప్లాటుఫారం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. కాపీరైట్‌పై తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది.
రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ మంగళవారం (సెప్టెంబరు 27) నుంచి లైవ్‌స్ట్రీమ్ చేయాలని ఈ నెల 20న సీజేఐ ఆధ్వర్యంలో ఫుల్‌కోర్టు ఏకగ్రీవంగా తీర్మానించింది. జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ చేసిన రోజైన ఆగస్టు 26న చరిత్రలో తొలిసారిగా కోర్టు కార్యకలాపాలను వెబ్‌కాస్ట్ చేయడం గమనార్హం.
సుప్రీంకోర్టులో మూడు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నాయి. అందులో జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రెండవ రాజ్యాంగ ధర్మాసనం శివసేన వర్సెస్ శివసేన కేసును విచారించింది. మరో రెండు ధర్మాసనాలకు ముందుకు ఈడబ్ల్యుఎస్ కోటా, ఆలిండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటులపై విచారణలు జరిగాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్‌లతో కూడిన ద్విసభ్య రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను చేపట్టింది.
More Stories
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు
భారత మహిళల అండర్-19 జట్టు తొలి విజయం
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం