మనం హిందువులం, కానీ హిందువుకు ప్రత్యేక నిర్వచనం లేదు,  డా. భగవత్

భారతదేశం అనాది కాలం నుండి ప్రాచీనమైన దేశమని, అయితే నాగరికత లక్ష్యాలు, విలువలను మరచి పోవడం వల్ల అది స్వేచ్ఛను కోల్పోయిందని రాష్ట్రీయ  స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు.  మేఘాలయాలో షిల్లాంగ్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మన ఆధ్యాత్మికతలో ఇమిడి ఉన్న చిరకాల విలువలపట్ల మనకున్న స్వాభావిక విశ్వాసమే మనలను ఒకరికి మరొకరితో బంధించే శక్తి అని చెప్పారు.
 
“ఈ దేశపు శాశ్వతమైన నాగరికతకు చెందిన విలువలను మన దేశం వెలుపల ఉన్న ప్రజలు హిందూత్వ అని పిలుస్తారు. మనం హిందువులం, కానీ హిందువుకు ప్రత్యేక నిర్వచనం లేదు. అయినప్పటికీ అది మన గుర్తింపు. భారతీయ, హిందూ పదాలు రెండూ పర్యాయపదాలు. వాస్తవానికి ఇది భౌగోళిక-సాంస్కృతిక గుర్తింపు,” అని ఆయన వివరించారు.
 
 సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు సంబంధించిన విభిన్న స్ఫూర్తిదాయకమైన సంఘటనలను ప్రస్తావిస్తూ ఆయన పుట్టుకతోనే దేశభక్తుడు,స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వలసవాద శక్తితో పోరాడుతూ జైలు పాలైనప్పుడు, పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి ప్రకారం, కోర్టులో హెడ్గేవార్ చేసిన సమాధానం ఆయన చేసిన అసలు ప్రసంగం కంటే విద్రోహ పూరితంగా ఉందని భావించి అందుకు జైలుకు పంపుతున్నట్లు ప్రకటించారని డా. భగవత్ గుర్తు చేశారు.
 
 ఒకరి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలను వదిలి దేశం కోసం త్యాగం చేయమని సంఘ్ బోధిస్తుందని ఆయన పేర్కొన్నారు. గంట సేపు జరిగే సంఘ్ శాఖలలో, ప్రజలు ఇటువంటి మహోన్నత  విలువలను, మాతృభూమి పట్ల కర్తవ్యం గురించి తెలుసుకుంటారని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ఈ దేశ ప్రాచీన చరిత్ర నుండి ఇటువంటి త్యాగం చేసే సంప్రదాయాన్ని స్వీకరించినదని ఆయన తెలిపారు.
 
భారతీయ పూర్వీకులు వివిధ ప్రాంతాలను దాటి జపాన్, కొరియా, ఇండోనేషియా, అనేక ఇతర దేశాలకు ఇటువంటి ఉన్నత విలువలను వ్యాప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో వివిధ దేశాలకు వ్యాక్సిన్‌లను పంపడం ద్వారా భారత్ మానవాళికి ఎలా సేవ చేసిందనే ఉదాహరణలను ప్రస్తావిస్తూ, “మనం ఈ రోజు కూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాము” అని డా. భగవత్ స్పష్టం చేశారు.
 
1925లో ప్రారంభించినప్పటి నుండి ఐదు తరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ నుండి అంకితభావంతో కూడిన స్వయంసేవకుల సహాయంతో జాతీయ పునర్నిర్మాణ పనులను ఎలా చేస్తుందో సర్ సంఘచాలక్ ప్రస్తావిస్తూ సంస్థను పటిష్టంగా చేసుకోవడం కోసం పనిచేసే సంస్థ ఇది కాదని, భారతదేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి ఈ సమాజాన్ని సంఘటితం చేయడమే నిజమైన లక్ష్యం అని ఆయన వివరించారు.
 
ఇటువంటి లక్ష్యం సాధించడానికి, స్వయంసేవకులు శాఖలో పని చేసే పని పద్ధతి నుండి కొన్ని క్రమశిక్షణాలను నేర్చుకుంటారని చెప్పారు. సంఘ్ దృక్పథం ఏమిటంటే, ప్రతి రోజూ పని చేయడం ద్వారా దానిని తమ స్వంత అలవాటుగా మలచుకోవడం అని తెలిపారు.
 
భారత్ శక్తివంతం, సుసంపన్నం కాగలిగితే ప్రతి భారతీయుడు కూడా పుష్కలమైన వనరులను సమకూర్చుకోగలరని అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, సమాజ నాయకులు, ఆధ్యాత్మిక, సామాజిక ప్రముఖుల సమక్షంలో, డా. భగవత్ స్పష్టం చేశారు. దూరం నుండి కాకుండా, ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ఆర్ఎస్ఎస్ ను విశ్లేషించుకోవాలని ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రేక్షకులను కోరారు. రెండు రోజుల మేఘాలయ పర్యటనకు వచ్చిన డా. భగవత్ సంఘ్ కార్యకర్తలతో పాటు సామాజిక, సాంస్కృతిక నాయకులతో పలు సమావేశాలలో పాల్గొంటారు.