కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి గెహ్లాట్‌ ఇక దూరం!

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఇక ఎన్నిక కావడమే మిగిలింది అన్నట్లుగా సన్నాహాలు చేసుకొంటున్న రాజ‌స్ధాన్ ముఖ్యమంతి అశోక్ గెహ్లాట్‌ కు ఇప్పుడా పదవి దూరమయిన్నట్లు స్పష్టం అవుతున్నది. ఆయన నామినేషన్ కూడా వేయకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. సోనియా గాంధీ సన్నిహితులు సహితం ఇటువంటి పరిస్థితులలో గెహ్లాట్ కు పార్టీ నాయకత్వం అప్పచెప్పడం సరికాదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
 
ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకొని ఉండడం కోసం పార్టీ ఎమ్యెల్యేలతో తిరుగుబాటు చేయించిన ఆయన ధోరణి పట్ల పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఇప్పుడామె ఒక వంక రాజస్థాన్ సంక్షోభంను సరిదిద్దడంతో పాటు, కాంగ్రెస్ అధ్యక్షునిగా మరొకరిని ఎంపిక చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
 
గెహ్లాట్ సహితం ప్రస్తుత పరిస్థితుల్లో `ముళ్ళ కిరీటం’ వంటి కాంగ్రెస్ అధ్యక్ష పదవికన్నా సొంత రాష్ట్రంలో, తనకు పట్టుగల ముఖ్యమంత్రి పదవి పట్లనే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నది. మరోవంక, కాంగ్రెస్ కు ఓ దిశ గాని, నాయకత్వం గాని లేదని రాజస్థాన్ పరిస్థితులు స్పష్టం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయడం పట్ల కన్నా, కేవలం అధికారం కోసమే ఆరాట పడుతున్నదని విమర్శించారు.
 
తాము ఏర్పాటు చేసిన శాసనసభ పక్ష సమావేశంపై హాజరు కాకుండా, 90 మందికి పైగా పార్టీ ఎమ్యెలు మరో మంత్రి ఇంట్లో సమావేశమై తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ అధిష్ఠానాంకు షరతులు పెట్టడం అంతా గెహ్లాట్ ఆడించిన నాటకమే అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ఇది ఖచ్చితంగా క్రమశిక్షణారాహిత్యమే అని స్పష్టం చేశారు.
 
మరో పరిశీలకుడు అజయ్ మాకెన్ కనీసం గెహ్లాట్ తో సమావేశం కాకుండా, జైపూర్ నుండి వెనుకకు వచ్చేసారు. రాహుల్ గాంధీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం ఎదురు చూస్తున్న సచిన్ పైలట్ మాత్రం ఈ ధిక్కార ధోరణి ప్రదర్శించిన గెహ్లాట్ పై తగు చర్య తీసుకోవలసింది అంటూ పార్టీ అధిష్ఠానంపై వత్తిడి తెస్తున్నారు.
 
ఈ మొత్తం వ్యవహారంలో ఖంగు తిన్న సోనియా గాంధీ రాజస్థాన్ వ్యవహారాలు చక్కబెట్టడం కోసం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు కబురు పెట్టిన్నట్లు తెలుస్తోంది. రాజ‌స్ధాన్‌లో పార్టీ వ్య‌వ‌హారాలు ర‌చ్చ‌కెక్క‌డంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌ను రాజ‌స్ధాన్‌కు పంపారు.
 
ఎమ్మెల్యేల తిరుగుబాటుపై అశోక్ గెహ్లాట్‌నుంచి వేణుగోపాల్ వివ‌ర‌ణ కోరారు. గెహ్లాట్‌ వ‌ర్గీయుల్లో ఒక‌రికి సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని, స‌చిన్ పైల‌ట్‌ను సీఎంగా నియ‌మిస్తే వ్య‌తిరేకిస్తామ‌ని ఆదివారం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అధిష్టానం దూత‌ల‌కు స్ప‌ష్టం చేస్తున్నారు.  ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాతే రాజ‌స్ధాన్‌లో నాయ‌క‌త్వ మార్పు అంశాన్ని చేప‌డ‌తామ‌ని పార్టీ నాయ‌క‌త్వం సంకేతాలు పంపుతోంది. నాయ‌క‌త్వ మార్పు విష‌యంలో అశోక్ గెహ్లాట్‌ సూచించిన వారినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని చెబుతోంది.