ప్రత్యేక ఏవియేషన్ ఇంధనం, మానవరహిత ఏరియల్ వెహికల్స్ ప్రారంభం

పిస్టన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ ల కోసం ఉద్దేశించిన ఎ.వి.జి.ఎ.ఎస్ 100 ఎల్.ఎల్, ప్రత్యేక ఏవియేషన్ ఫ్యూయల్ ను, మానవరహిత ఏరియల్ వెహికల్స్ ను  కేంద్ర పెట్రోలియం,  సహజవాయువు , గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ  ప్రారంభించారు. “మనం గణనీయమైన మార్పు కు లోనవుతున్నాం, ఇది దాదాపు విప్లవాత్మకమైనది. జీవ ఇంధన బ్లెండింగ్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా దిగుమతి చేసుకున్న ఇంధనాలపై ఆధారపడటాన్ని మనం తగ్గిస్తున్నాం” అని  ఈ సందర్భంగా చెప్పారు.

ప్రస్తుతం భారతదేశం ఈ ఉత్పత్తిని ఐరోపా దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఇండియన్ ఆయిల్ నిర్వహించిన ఈ ప్రారంభ కార్యక్రమంలో స్వదేశీ ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ను ప్రారంభించడం ప్రాముఖ్యతను పూరీ   వివరించారు.  ఎయిర్ పోర్టులలో రద్దీ పెరగడం, విమానాల సంఖ్య పెరగడం, పైలట్ శిక్షణ కోసం ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య పెరగడం, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ టి ఓ)ల పెరుగుదలతో అభివృద్ధి చెందుతున్న విమానయాన పరిశ్రమ అవసరాలను తీర్చడానికి స్వదేశీ ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ను ప్రారంభించడం చాలా ముఖ్యం అని  తెలిపారు.

భారతదేశంలో విమాన రవాణాకు డిమాండ్ భవిష్యత్తులో అనేక రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నందున, శిక్షణ పొందిన పైలట్లకు కూడా భారీ డిమాండ్ ఉంటుందని, ఇందుకోసం ఎఫ్టీవోల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

 పౌర విమానయాన, రోడ్డు రవాణా,  రహదారుల శాఖ సహాయ మంత్రి  జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) మాట్లాడుతూ, హర్దీప్ పూరి నాయకత్వంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మనం ఇప్పటివరకు దిగుమతి చేసుకున్న స్వదేశీ ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ను దేశీయంగా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు.

‘’ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతలో భాగంగా ఐఒసిఎల్ ఎవి గ్యాస్ 100 ఫ్యూయెల్ తో ముందుకు వచ్చింది, దీనిని ఇప్పటి వరకు భారీ ఖర్చుతో దిగుమతి చేసుకున్నారు. మన అన్ని ఫ్లైట్ స్కూళ్లు,  ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ఉపయోగించే అన్ని ఇతర చిన్న విమానాలు దీనిని స్వదేశీ వనరుల నుండి కొనుగోలు చేయడం ద్వారా   డబ్బు ఆదా కు దోహద పడుతుంది.  ఎ.వి. గ్యాస్ 100 ఎల్ఎల్ ఇంధనం అవసరమైన ప్రాంతాలకు, దేశాలకు ఎగుమతి చేసే విషయంలో ఇది మనకు చాలా వ్యత్యాసాన్ని కలిగిస్తుంది’’ అని ఆయన వివరించారు.

దేశీయ డిమాండ్ ను తీర్చడంతో పాటు, ఎగుమతి అవకాశాలను లక్ష్యంగా చేసుకోవడానికి త్వరలో కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు  ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. వాస్తవానికి దిగుమతి చేసుకున్న గ్రేడ్ లతో పోలిస్తే స్వదేశీ ఇంధనం మెరుగైనదని చెబుతూ ఎ.వి. గ్యాస్ మార్కెట్ ప్రస్తుత 1.92 బిలియన్ డాలర్ల నుండి 2029 నాటికి 2.71 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.