బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఫీజిబిలిటీ లేనందుకే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్రం పెట్టకపోతే, తామే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఎందుకు నిర్మించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

ఫీజిబిలిటీ ఉంటే ఎవరైనా ఫ్యాక్టరీ పెడతారని, అది ఉంది కాబట్టే తెలంగాణలో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. బయ్యారంలో లభించే ముడి పదార్థంలో ఐరన్ శాతం తక్కువగా ఉందని, దాంతో ఉక్కు ఉత్పత్తి సాధ్యం కాదని చెప్పారు. చత్తీస్‌గఢ్ నుంచి ఖనిజాన్ని తీసుకొచ్చి ఉక్కు తయారు చేస్తే రవాణా ఖర్చులు తడిసిమోపెడై తయారైన ఉక్కు ధర మార్కెట్లో దొరికే ఉక్కు ధరతో పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కొనసాగుతోందని ఉదహరించారు.

 ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప మరేమీ ఉండదని ఆయన తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల నేపథ్యంలో స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం ప్రతిపాదనలు వచ్చాయని, కానీ నష్టాలను సెయిల్ భరించడానికి సిద్ధంగా లేదని పేర్కొన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల గురించి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల పాలకులు, అధికారులు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని కిషన్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాలతో అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించిందని గుర్తుచేశారు.

ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కేవలం రెండు రాష్ట్రాల మధ్య పంపకాలకు సంబంధించినవేనని ఆయ చెప్పారు. ఉదాహరణకు ఢిల్లీలో ఉమ్మడి భవన్ విభజన విషయంలో ఖాళీ స్థలంలో కొత్త భవన్ నిర్మించుకోడానికి ఇప్పుడు ఏ రాష్ట్రం సిద్ధంగా లేదని తెలిపారు. ఒకసారి అడిగినప్పుడు తాము కొత్త భవన్ నిర్మించుకుంటామని రెండు రాష్ట్రాలూ చెప్పాయని గుర్తుచేశారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బదులు ఓవర్హాలింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. తద్వారా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దీని కోసం తాను 4 సార్లు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తే తప్ప స్థలం కెటాయింపు పూర్తి కాలేదని విచారం వ్యక్తం చేశారు.

 తెలంగాణ రాష్ట్రం కోసం మంజూరు చేస్తున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం నాలుగైదు ప్రాంతాల పేర్లు చెప్పారని, కానీ ఎక్కడా స్థలం కేటాయింపు జరపలేదని పేర్కొన్నారు. ఎక్కడ ఇచ్చినా సరే కేంద్రం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.

రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ తాము కావాలనుకున్నవాటికి స్థలాలు కేటాయిస్తున్నారని, మిగతావాటిపై ఎన్ని లేఖలు రాసినా స్పందనే లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు దరఖాస్తే చేయలేదని చెప్పారు.

రెండో విడతలోనైనా దరఖాస్తు చేసుకోమని చెప్పినా సరే చేయలేదని, తీరా ఇప్పుడు కేంద్రం తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేని నిందలు వేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.