మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం

నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం మైసూర్ లో ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే దసరా ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి.  మైసూరులోని చాముండి కొండలపై ఉన్న చాముండేశ్వరి దేవతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దసరా 2022 ఉత్సవాలను ఆమె ప్రారంభించారు.

చరిత్ర, జానపద కథలకు సంబంధించిన దేవుళ్ళు, దేవతలు, మానవ పాత్రల పండుగలు భారతదేశం అంతటా జరుపుకుంటారని, మైసూరులో దసరా ఉత్సవాలు భారతీయ సంస్కృతి,  సంప్రదాయానికి సంబంధించిన వేడుక అని ముర్ము ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని పలు ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రాలు కర్ణాటకలో ఉన్నాయని రాష్ట్రపతి గుర్తు చేశారు.

జైన, బౌద్ధమతాలకు సంబంధించిన ప్రాచీన ప్రదేశాలు, ఆదిశంకరాచార్య స్థాపించిన శృంగేరి మఠం, కలబురగిలోని సూఫీ సంస్కృతి, 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవన్న అనుభవ మంటపం వంటి వాటిని ఆమె ఉదాహరణగా పేర్కొన్నారు.

కాగా, ఈ సందర్భంగా కర్ణాటక సాధిస్తున్న అభివృద్ధిని రాష్ట్రపతి కొనియాడారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో భారతదేశం అందుకున్న మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్‌డిఐ) 53% సాధించడం ద్వారా,  కర్ణాటక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో,  నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21 దేశంలోనే కర్నాటక అగ్రస్థానంలో ఉందని ఆమె తెలిపారు.

దసరా వేడుకలను ఆరంభించేందుకు తమ ఆహ్వానాన్ని ముర్ము మన్నించినందుకు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ కూడా ఈ దసరా ప్రారంభ వేడుకలలో పాల్గొన్నారు. ఇదివరలో గవర్నర్ టివిలో ఆ కార్యక్రమాలు చూసేవారు. మంత్రి ఎస్.టి. సోమశేఖర్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్నాటక మంత్రి వి. సునీల్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ఘనమైన కర్ణాటక సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నిర్వహించే దసరా ఉత్సవాలను తిలకించడానికి మైసూరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు చేరుకుంటారు. కరోనా కారణంగా గడచిన రెండు సంవత్సరాలు ఈ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు.

చాముండి హిల్స్‌పై వెలసిన చాముండేశ్వరి ఆలయంలో వృశ్చిక లగ్న శుభఘడియలలో వేద మంత్రాల పఠనం నడుమ రాష్ట్రపతి ముర్ము మైసూరు మహరాజ వంశస్తుల ఆరాధ్య దేవత చాముండేశ్వరి దేవిపై పుష్ప వర్షం కురిపించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభా కరండ్లజే, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముర్ము ఒక రాష్ట్రాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

కాగా, శతాబ్దానికిపైగా చరిత్ర క‌లిగిన మైసూర్ సిల్క్ చీర‌ను ధరించిన రాష్ట్రపతి ముర్ము ద‌స‌రా ఉత్స‌వాల ప్రారంభోత్స‌వంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. దానికి తోడు క‌ర్ణాటక సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ముర్ము త‌ల‌పై ప్యాటాను అలంక‌రించ‌డంతో ఆ ఆక‌ర్ష‌ణ రెట్టింప‌య్యింది.

మైసూరు జిల్లా పాల‌నా యంత్రాంగానికి చెందిన ప్ర‌తినిధి బృందం ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వెళ్లి ఆమెను ద‌స‌రా ఉత్స‌వాల ప్రారంభోత్స‌వానికి ఆహ్వానించింది. ఆ సంద‌ర్భంగానే ఆ బృందం ఆమె కోసం ప్ర‌త్యేకంగా నేయించిన మైసూరు సిల్క్ శారీని బ‌హూక‌రించింది. ఆ చీర‌ను ధ‌రించే రాష్ట్ర‌ప‌తి ముర్ము ద‌స‌రా ఉత్స‌వాల‌ను ప్రారంభించారు. బంగారు జ‌రి అంచుతో ఉన్న ఆ చీరలో రాష్ట్ర‌ప‌తి చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించారు.