ఉగ్రవాదులను కాపాడితే మీకూ ప్రమాదమే … చైనా, పాక్ లకు హెచ్చరిక

‘‘ఐక్యరాజ్యసమితిలోఉగ్రవాదులపై ఆంక్షలు విధించే చట్టంపై రాజకీయం చేస్తూ.. ఉగ్రవాదులను కాపాడితే మీరు కూడా ప్రమాదంలో పడతారు” అని పాకిస్తాన్, చైనాలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. శనివారం యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం విషయంలో పాక్, చైనాల తీరును తప్పు పడుతూ గట్టి సందేశం ఇచ్చారు.

భారత్ మాత్రం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుటులను అధికారికంగా టెర్రరిస్టుఉగ్రవాదులుగా ప్రకటించే ప్రతిపాదనలను పాక్, చైనా తరచూ వ్యతిరేకిస్తున్నాయి.

చైనా తన వీటో అధికారంతో పాక్ ఉగ్రవాది టులను అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై ఆ రెండు దేశాల తీరును జైశంకర్ ఎండగట్టారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలకంగా మారిందని, ప్రధానంగా దక్షిణ దేశాల (గ్లోబల్ సౌత్)కు గొంతుకలా మారిందన జైశంకర్ చెప్పారు. 

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానాన్ని ప్రస్తావిస్తూ భారత్ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి నిర్ధేశించిన శాంతి మార్గాన్ని అనుసరించినట్లు స్పష్టం చేశారు. “మీరు ఎవరి పక్షం అని తరచుగా అడుగుతున్నారు. మేము నిజాయతీగా ఉన్నట్లు చెబుతున్నాం” అని గుర్తు చేశారు.భారత్ శాంతిపక్షం వహిస్తుందని చెబుతూ అదేవిధంగా కొనసాగుతుందని తెలిపారు.

పెరుగుతున్న ఆహరం, ఇంధనం, ఎరువుల ధరలతో సతమతమవుతున్న వారి పక్షం వహిస్తామని చెబుతూ కేవలం సంప్రదింపులు, దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమని నమ్ముతున్నామని చెప్పారు. ప్రపంచ శ్రేయస్సు కోసం మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా మరో 25 సంవత్సరాలలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని అనుకుంటున్నట్లు జైశంకర్ ప్రకటించారు.

రష్యా రాయబారితో భేటీ

ఇలా ఉండగా, రష్యా వివిధ రంగాల్లో భారత్ కు ప్రధాన భాగస్వామి అని జైశంకర్ తెలిపారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్ లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభం, జీ20, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు వంటి అంశాలపై తాము చర్చించినట్లు తెలిపారు.

కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై భారత్,   బ్రెజిల్ తగిన దేశాలని సెర్గీ లావ్ రోవ్ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మద్దతు పలికారు. రష్యా ఇలా బహిరంగంగా ఇంత స్పష్టంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి.

అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని, శాశ్వత సభ్యత్వం పొందడానికి యోగ్యత కలిగిన దేశమని అభివర్ణించారు. ప్రస్తుతం భారత్‌కు తాత్కాలిక సభ్యత్వం ఉంది. దీని కాలపరిమితి రెండేళ్లు కాగా, అది ఈ డిసెంబరులో ముగియనుంది. ఆ సమయానికి భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో రష్యా ఉండనుంది. రష్యా చేసిన ప్రకటనతో ఒక్క చైనా మినహాయించి మిగిలిన నాలుగు దేశాలు భారత్‌కు మద్దతు ఇచ్చినట్టయింది.