మాటలు కోటలు దాటుతున్నా చేతలు ప్రగతి భవన్ కూడా దాటటల్లేదు

కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ చేతలు ప్రగతి భవన్, ఫాంహౌస్ కూడా దాటడంలేదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం తమ చేతకానితనం, అక్రమ పాలన, అహంకార పాలనతో దాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.  రాష్ట్రంలో యథేచ్చగా అక్రమాలు, కబ్జాలు జరుగుతున్నాయని చెబుతూ రాష్ట్రంలో మొదటి వెన్నుపోటు దళితులకే జరిగిందని స్పష్టం చేశారు. వారికి ఇస్తానన్న మూడెకరాల భూమి, ఉద్యోగాలు ఎక్కడ? అని ప్రశ్నించారు. 8 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన నడుస్తోందన్న ఆయన ధరణి పోర్టల్ లో మార్పుల కారణంగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్ లో జరిగిన పొరపాట్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని 4 లక్షల మంది ఫిర్యాదు చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని చెబుతూ ఇది రూ.5 లక్షల కోట్ల అప్పులకు పెరిగిందన్న ఆయన.. ఇంకా నిధులు కావాలని డిమాండ్ చేస్తూ కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ డబ్బుల సంచులు పట్టుకుని ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని, కేసీఆర్ తీరు చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

అనేక శాఖలకు, విభాగాలకు చెల్లింపులు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి 80 శాతం రెవెన్యూ ఇస్తున్న జీహెచ్ఎంసీ ముందు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 8 ఏళ్లుగా గ్రామ పంచాయితీలకు ఎన్ని ఫండ్స్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై చర్చించేందుకు కేంద్రం రెడీగా ఉందని, మరి కేసీఆర్ రెడీనా అంటూ సవాల్ విసిరారు. 

తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆయా కార్యాలయాల్లో అధికారులు ఈగలు తోలుకుంటున్నారని  కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.
 
రాష్ట్ర ప్రభుత్వానికి అసలు విద్యావ్యవస్థ పై అవగాహన ఉందా? అని నిలదీశారు. గురుకులాల్లో, హాస్టళ్లలో కనీస వసతుల్లేవని ఆరోపించారు. చదువుకోవాల్సిన అమ్మాయిలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే దళితబంధు అందరికీ ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజమైన అర్హులకు దళిత బంధు ఇవ్వాలని కోరారు.
 
కేసీఆర్ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలు విద్యుత్ ఉత్పాదక సంస్థల పరిరక్షణ కోసమేనని, విద్యుత్ సంస్థలు పతనమైతే దేశం కుప్పకూలుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పడిపోతుందని, డిస్కంలు దివాళా తీస్తాయని స్పష్టం చేశారు.