రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం సృష్టించిన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పడానికి తమ అభ్యర్థిగా సోనియా గాంధీ కుటుంభం ఎంపిక చేసిన్నట్లు భావిస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వారి అభీష్టానికి వ్యతిరేకంగా సొంత రాష్ట్రంలోనే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారు. ఇంకా అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా దాఖలు చేయని గెహ్లాట్ ముందుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసిందే అని సోనియా, రాహుల్ గాంధీలు స్పష్టం చేశారు.
 
ఇదే అదను అనుకోని, గతంలో తిరుగుబాటు చేసి, ఎమ్యెల్యేలతో శిబిరం నడిపినా ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో విఫలమైన తన సన్నిహితుడు సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం రాహుల్ వేసిన ఎత్తుగడను గెహ్లాట్ తిప్పికొట్టారు.  కాబోయే ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ పేరును ఖరారు చేయడం కోసం ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం రసాభాసగా మారింది.
 
సమావేశం జరపడానికి ఏఐసీసీ ప్రతినిధులుగా జైపూర్ కు వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే,  రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్ మకెన్ సమావేశం జరుపకుండానే తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. పైగా, గెహ్లాట్ ముఖ్యమంత్రిగా కొనసాగ వలసిందే అంటూ ఎమ్యెల్యేలు పట్టుబట్టడంతో పాటు సచిన్ ను ఎంపికచేసి ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఏకంగా 92 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు ఆదివారం రాత్రి స్పీకర్ సిపి జోషిని కలిసి రాజీనామా పత్రాలు కూడా సమర్పించారు.
 
సోనియా, రాహుల్ లను కలసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించిన గెహ్లాట్ తన స్థానంలో పైలట్ ను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. గతంలో పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేసిన వారిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
 
తాను రాజీనామా చేయవలసి వస్తే, తాను చెపిప్న వారినే ముఖ్యమంత్రిగా చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం స్పీకర్ సిపి జోషి పేరును ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. 2008లో సిపి జోషి ముఖ్యమంత్రి కావలసి ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గెలుపొందిన కేవలం ఒక ఓట్ తేడాతో ఎమ్యెల్యేగా ఓటమి చెందడంతో గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
 
ఒక విధంగా `భారత్ జోడో యాత్ర’లో ఉన్న రాహుల్ గాంధీ నాయకత్వంపై దీనిని బహిరంగ తిరుగుబాటుగానే పరిగణింప వలసి ఉంటుంది. ఆదివారం అంతా  జైసల్మెర్‌లో తీరుబడిగా గడిపిన గెహ్లోట్ సాయంత్రం తరువాత జైపూర్‌కు చేరిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తనకు అధిష్టానంపై అపార నమ్మకం ఉందని అంటూ ఇక తాను చేయవలసింది ఏమీ లేదన్నట్లు స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల బెదిరింపులపై ఢిల్లీ నుంచి పార్టీ నేతలు గెహ్లోట్‌కు రాత్రి ఫోన్ చేశారు. అయితే వారి రాజీనామాల అంశంపై తానేమీ చేయలేనని, తన చేతుల్లో ఏమీ లేదని నేతలకు గెహ్లోట్ చేతులు ఎత్తేసిన్నట్లు  తెలిసింది. వారి ఇష్టానుసారం వ్యవహరించుకునే వీలుందని, అంతా వారి ఇష్టం అని ఫోన్‌లో స్పష్టం కూడా చేసిన్నట్లు చెబుతున్నారు.