చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు

గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి  షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ మన్ కీ బాత్ ప్రసంగం 93వ ఎపిసోడ్‌లో ఆదివారం ఈ ప్రకటన చేశారు.
 
సెప్టెంబరు 28న భగత్ సింగ్ జయంతి జరుపుకునే ముఖ్యమైన రోజు ‘అమృత్ మహోత్సవ్’ రాబోతోందని చెబుతూ “ఆయన జయంతికి ముందు, నివాళిగా,   మొహాలీ-చండీగ‌ఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాము” అని తెలిపారు. అమరవీరుల స్మారక చిహ్నాలు, వారి పేరు మీద ఉన్న స్థలాలు, సంస్థల పేర్లు మనకు స్పూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు.
”ప్రియమైన దేశవాసులారా, మూడు రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 28న అమృత్ మహోత్సవ్‌లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆరోజు భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్ సింగ్ జయంతి జరుపుకోనున్నాం. భగత్ సింగ్‌కు ఘన నివాళిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం. ఛండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెడుతున్నాం” అని మోదీ ప్రకటించారు.
 
వాతావరణ మార్పు సముద్ర పర్యావరణ వ్యవస్థలకు పెను ముప్పు అని పేర్కొంటూ బీచ్‌లలో చెత్తాచెదారం కలవరపెడుతుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ సవాళ్లను పరిష్కరించడానికి తీవ్రమైన, నిరంతర ప్రయత్నాలు చేయడం మన బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.
కాగా, బిజెపి సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ లోతైన ఆలోచనాపరుడు, దేశానికి గొప్ప దార్శనికుడు అని కొనియాడారు.  ఆయన ప్రవచించిన ఏకాత్మ  మానవతావాదం, చిట్టచివరి  వ్యక్తికి మొదటగా న్యాయం అందించాలనే ప్రతిపాదన నేటికీ అనుసరణీయమని తెలిపారు.

 
చిరుతలు పేర్లు సూచించండి
 
గత వారం నంబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతలకు పేర్లు పెట్టే ప్రచారంపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను అభ్యర్థించారు. చీతాలపై భారత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచార కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలి? అలాగే నమీబియా నుంచి వచ్చిన చీతాలకు ఎలాంటి పేర్లు పెట్టాలో MyGov వెబ్ సైట్  ద్వారా సూచించాలని కోరారు.  
 
 మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను వదిలారు. “చిరుతలకు పేరు పెట్టడం మన సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే, మనుషులు జంతువులతో ఎలా ప్రవర్తించాలో కూడా సూచించండి. ఈ పోటీలో పాల్గొనండి.  చిరుతలను చూసే వారిలో మీరు మొదటి వ్యక్తి కావచ్చు” అని ప్రధాని మోదీ తెలిపారు.
 
 చిరుతలు తిరిగి రావడం పట్ల దేశం నలుమూలల నుండి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని, 1.3 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోయి గర్వపడుతున్నారని ఆయన చెప్పారు. ఒక టాస్క్‌ఫోర్స్ చిరుతలను పర్యవేక్షిస్తుందని, దాని ఆధారంగా ప్రజలు చిరుతలను ఎప్పుడు సందర్శించవచ్చో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.
 
చిరుతలు 1952లో భారతదేశం నుండి అంతరించిపోయినట్లు ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 17న, ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా ఆఫ్రికాలోని నమీబియా నుండి ఎనిమిది చిరుతలను (5 ఆడ, 3 మగ) తీసుకువచ్చారు.  దేశంలోని వన్యప్రాణులు, నివాసాలను పునరుజ్జీవింప చేసేందుకు, వైవిధ్యభరితంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
 
కునో నేషనల్ పార్క్‌లోని రెండు రిలీజ్ పాయింట్ల వద్ద చిరుతలను ప్రధాని మోదీ విడుదల చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నంబియా మద్దతుతో దేశంలో పెద్ద పిల్లులను తిరిగి ప్రవేశపెట్టిన ‘ప్రాజెక్ట్ చిరుత’, పర్యావరణం, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రభుత్వ ప్రయత్నం. ఇంటర్-కాంటినెంటల్ చీతా ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎనిమిది చిరుతలను గ్వాలియర్‌లోని కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లో తీసుకొచ్చారు.
 
తరువాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి కునో నేషనల్ పార్క్‌కి చిరుతలను తీసుకువెళ్లాయి. శాటిలైట్ ద్వారా పర్యవేక్షించేందుకు అన్ని చిరుతలకు రేడియో కాలర్‌లను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, ప్రతి చిరుత వెనుక ఒక ప్రత్యక్ష పర్యవేక్షణ బృందం ఉంది, వారు 24 గంటల పాటు వాటిని పర్యవేక్షిస్తారు.